AP | ఇక రైల్వే గేట్లుండ‌వ్.. ఆర్‌వోబిలే…

ఏలూరు నగరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందడుగు…
ట్రాఫిక్ కష్టాల నుంచి ఏలూరు నగర ప్రజలకు శాశ్వత విముక్తి…


ఆంధ్ర ప్రభ, జులై 15, ఏలూరు బ్యూరో : రైల్వేగేట్ల స్థానే ఆర్‌వోబిలు నిర్మించాలనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏలూరు నగరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తూ, నగరానికి గేట్ల మార్గం ద్వారా కలిగే ట్రాఫిక్‌ చెరనుండి మోక్షం కల్పించేందుకు శ్రమిస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు.

ఒకపక్క నియోజకవర్గాభివృద్ధికి రాజీలేని పోరాటం చేస్తూనే, మరోపక్క అభివృద్ధికి సహకరించిన వారికి న్యాయం చేసేందుకు, లబ్ది చేకూర్చేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు నగర ముఖచిత్రాన్ని మార్చేందుకు, ట్రాఫిక్ కష్టాల నుంచి నగర ప్రజలకు శాశ్వత విముక్తి ప్రసాదించేందుకు కీలక అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2029 నాటికి రైల్వేగేట్ల స్థానంలో సరికొత్త ఆర్‌వోబిల నిర్మాణానికి శరవేగంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

నియోజకవర్గాభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేస్తూ వస్తోన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. నగరంలోని అవసరమైన ప్రాంతంలో బ్రిడ్జిల నిర్మాణానికి శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వాటి అమలుకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తూ వస్తున్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇదేక్రమంలో బుధవారం ఏలూరు మార్కెట్ యార్డు సమీపంలోని రైల్వే గేటు వద్ద నిర్మించనున్న ఆర్వోబీ ప్రాంతాన్ని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే, మ్యాప్ ద్వారా పనుల వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ…. గతంలో సేతుబంధన్‌ పథకంలో భాగంగా మార్కెట్‌ యార్డు ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భాగస్వామ్యంతో ఆర్‌వోబి మంజూరైన విషయాన్ని గుర్తుచేశారు. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో రైల్వే ప్రాజెక్టుగా మార్చాలనే తన ప్రతిపాదనను ప్రధానంగా స్వీకరించారని, దీనికి ఎంపీ మహేష్‌ యాదవ్ కూడా తనవంతు సహకారం అందించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ బ్రిడ్జి నిర్మాణాన్ని నూరుశాతం రైల్వే శాఖా టేకోవర్‌ చేసుకుందని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి, బ్రిడ్జి నిర్మాణ సమయంలో ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు అన్యాయం జరగకుండా, వారికి అవసరమైన న్యాయం చేసేందుకు, గరిష్ట లబ్ది చేకూర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, ఈ విషయంలో ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తామని బాధితులకు కొండంత భరోసానిచ్చారు.

ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎన్ని ఇళ్ళు కోల్పోవాల్సి వస్తుందీ, ఎంతమందికి పరిహారం చెల్లించాల్సి వస్తుందనే విషయాలను రెండురోజుల్లో అధికారులకు ప్రత్యేక రిపోర్టు ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ఇళ్ళు కోల్పోతున్న వారికి అవసరమైన మేర పరిహారం అందించడం జరుగుతుందని, పర్మినెంట్‌ పట్టాలు ఉన్న వాళ్ళందరికీ బిల్డింగ్‌ కాస్టు చెల్లించడంతో పాటూ, బి-ఫార్మ్‌ పట్టాలు కలిగిన వారికి స్థలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. నగరాభివృద్ధితో పాటు ప్రజల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అత్యంత సానుకూల పరిణామంగా పేర్కొన్న ఆయన, పవర్‌ పేట ప్రాంతంలో నిర్మించనున్న ఆర్‌వోబి విషయంలో కూడా ఇదే మాట వర్తిస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్‌ఎస్‌ఈ శ్రీనివాసరావు, రైల్వే కన్సల్టెన్సీ కోస్టర్‌ ల్యాండ్‌ సర్వేయర్‌ సయ్యద్‌ షాన్‌బాషా, ఆర్‌అండ్‌బి డిఈ గోవింద మోహన్‌, కార్పొరేషన్‌ ఆర్వో అరుణ, ఆర్‌ఐలు సాయిపవన్‌, రవికుమార్‌, టీడీపీ నాగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, పలువురు క్లస్టర్ ఇన్చార్జులు, డివిజన్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.