నేను బతికే ఉన్నా.. పెన్షన్ ఇప్పించండి!”

నేను బతికే ఉన్నా.. పెన్షన్ ఇప్పించండి!”
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : తాను బతికే ఉన్నప్పటికీ అధికారిక రికార్డుల్లో మృతురాలిగా నమోదు కావడంతో పెన్షన్ అందడం లేదని మండలానికి చెందిన మాదారపు లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్‌కు ఆమె వినతి పత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ, తన భర్త మరణించడంతో విధవ పెన్షన్ కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లగా, రికార్డుల్లో తాను కూడా మృతురాలిగా నమోదు అయ్యిందని తెలిసి షాక్‌కు గురయ్యానని తెలిపింది. దీంతో తాను బతికే ఉన్నప్పటికీ పెన్షన్ రావడం లేదని, తన వివరాలను సరిచేసి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంది. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
