AP| ఇసుక మాఫియాపై ఉక్కుపాదం..
అక్రమ తవ్వకాలు, రవాణాపై కలెక్టర్, ఎస్పీ కఠిన హెచ్చరిక
ప్రతి అనుమతి పొందిన వాహనంపై విండ్‌స్క్రీన్‌లో పర్మిట్ తప్పనిసరి
అక్రమ రవాణాలో పట్టుబడితే రీచ్ అనుమతులు రద్దు చేసే చర్యలు
రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల సంయుక్త టాస్క్‌ఫోర్స్‌తో ప్రత్యేక దాడులు
చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే తవ్వకాలు, రవాణాకు అనుమతి
తిరుపతి, జులై 15, ఆంధ్రప్రభ: జిల్లాలో ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట..
జిల్లాలో అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక, కంకర తవ్వకాలు, అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరగకుండా అన్ని శాఖలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే తవ్వకాలు, రవాణా జరిగేలా క్షేత్రస్థాయిలో పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని, నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.

ప్రతి వాహనానికి పర్మిట్ తప్పనిసరి..
అనుమతి పొందిన ఇసుక రీచ్‌లు, క్వారీల నుంచి ఖనిజాలను తరలించే ప్రతి వాహనం సంబంధిత పర్మిట్‌ను విండ్‌స్క్రీన్‌పై తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. వాహనాల నమోదు సంఖ్యలతో కూడిన పూర్తి వివరాలను రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు అందజేయాలని సూచించారు. ఆన్‌లైన్ బిల్లు, అనుమతి పత్రాలు ఉన్న వాహనాలకే రవాణా అనుమతించాలని, నిబంధనలు పాటించని వాహనాలపై వెంటనే కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సంయుక్త దాడులు.. ప్రత్యేక నిఘా..
రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా శాఖలు పరస్పర సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాలు, కీలక రహదారుల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంతో పాటు ఇతర జలవనరుల వద్ద అనుమతించిన హద్దులను దాటి ఇసుక తవ్వకాలు జరగకుండా నీటిపారుదల, రెవెన్యూ శాఖలు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. అందిన ప్రతి సమాచారంపై సంయుక్త టాస్క్‌ఫోర్స్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

రీచ్ అనుమతుల రద్దు..
నిబంధనలు ఉల్లంఘించే రీచ్‌లు, వాహనాలపై ఎలాంటి రాజీ ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. అనుమతి పొందిన రీచ్‌కు చెందిన వాహనం అక్రమ రవాణాలో పట్టుబడితే సంబంధిత రీచ్ అనుమతిని రద్దు చేయడంతో పాటు అవసరమైతే తాత్కాలికంగా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. స్థానిక ప్రజల గృహ నిర్మాణ అవసరాల కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు జరిగే చిన్నస్థాయి ఇసుక రవాణాకు ఇబ్బందులు కలిగించవద్దని, అయితే పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు, డంపింగ్ చేసి టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పోలీసుల ప్రత్యేక దృష్టి..
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ అక్రమ ఇసుక, కంకర రవాణాపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖలతో సమన్వయం చేసుకుని సంయుక్త దాడులు నిర్వహిస్తామని తెలిపారు. అక్రమ తవ్వకాలు, రవాణాలో పాల్గొనే వ్యక్తులు, వాహనాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
సరఫరా, పర్యవేక్షణపై సమీక్ష..
సమావేశంలో జిల్లాలో ఇసుక, కంకర అవసరాలు, ప్రభుత్వ అభివృద్ధి పనులు, జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన ఖనిజాల సరఫరా, అనుమతుల ప్రక్రియ, అక్రమ తవ్వకాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, శాఖల వారీగా బాధ్యతలు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థపై సవివరంగా చర్చించారు. సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాశ్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, జిల్లా రవాణా అధికారి మురళీ మోహన్, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
