Paritala-Diamond-Hunt : కృష్ణమ్మ ఒడిలో వజ్రాల జల్లు Andhra Prabha Top Story

Paritala-Diamond-Hunt : కృష్ణమ్మ ఒడిలో వజ్రాల జల్లు Andhra Prabha Top Story

  • పరిటాలలో జనం పరవళ్లు
  • వ‌జ్రాల జ‌ల్లెడలో ఆశావహులు బిజీబిజీ
  • చంటి బిడ్డలతో కలిసి.. మరీ వెతుకులాట‌

(ఆంధ్ర‌ప్ర‌భ‌, ఎన్టీఆర్ బ్యూరో)

కృష్ణా తీరప్రాంతమైన పరిటాల గ్రామం మళ్లీ వజ్రాల వేటకు కేంద్రంగా మారింది. నిజాం నవాబుల కాలం నుంచి వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో తొలకరి జల్లులు కుర‌వ‌గానే వందలాది మంది ఆశావహులు రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చి మట్టిని జల్లెడ పడుతున్నారు. ఒక్క వజ్రం దొరికితే జీవితం మారిపోతుందనే ఆశతో ఎండను, వేడిని లెక్కచేయకుండా వెతుకులాట కొనసాగుతోంది. పరిటాల చెరువు సమీపంలోని సాగు భూములు, పొలాలు, బైపాస్ రోడ్డు ప్రాంతాల్లో గునపాలు, పారలు, పలుగులు, జల్లెడలతో మట్టి తవ్వుతూ, రంగు రాళ్లను జాగ్రత్తగా పరిశీలిస్తున్న దృశ్యాలు నిత్య‌కృత్యంగా మారాయి. మహిళలు, వృద్ధులు, యువకులు తేడా లేకుండా అంతా ఒక్కటై వజ్రాల అన్వేషణలో నిమగ్నమయ్యారు. కొందరు చంటి బిడ్డలను కూడా వెంటబెట్టుకొని వచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు గ్రామంలో గదులు అద్దెకు తీసుకొని, కొందరు చెరువు ఒడ్డునే తాత్కాలిక మకాం వేసి రోజుల తరబడి వెతుకుతున్నారు.

Paritala-Diamond-Hunt : ప‌రిటాల‌ చ‌రిత్ర ప‌దిలం..

నిజాం పాలనలో పరిటాల ముఖ్య కేంద్రంగా ఉండేది. గోల్కొండ వజ్రాల వ్యాపారంలో పరిటాల వజ్రాలకు ప్రముఖ స్థానం ఉందని చరిత్రకారులు చెబుతారు. కోహినూర్, పిట్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలు కృష్ణా తీరంలోనే దొరికినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందు నిజాం ప్రభువు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పగించకుండా తన అధీనంలో ఉంచుకున్న‌ట్లు చ‌రిత్ర ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.
రెండు ద‌శాబ్దాల క్రితం ల‌భ్య‌మైన వ‌జ్రం
రెండు దశాబ్దాల క్రితం జాతీయ రహదారి విస్తరణ సమయంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి చెరువు మట్టి తరలిస్తుండగా అత్యంత విలువైన వజ్రం దొరికి ముంబై మార్కెట్‌లో కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో కూడా వేలాది మంది వజ్రాల వేటకు తరలివచ్చి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

Paritala-Diamond-Hunt : రంగు రాళ్లతోనే హ్యాపీ

ప్రస్తుతం వజ్రాలు దొరకనప్పటికీ రంగు రాళ్లు ఎక్కువ సంఖ్యలో దొరుకుతున్నాయని అన్వేషకులు చెబుతున్నారు. వీటికి కూడా మంచి ధర వస్తోంది. వజ్రం దొరికితే త‌మ‌ జాతకమే మారిపోతుంద‌ని, వెతుకులాటకు పైసా ఖర్చు లేద‌ని ఆధార్ కార్డు తీసుకువ‌చ్చి బ‌స్సులో వ‌చ్చి వెతుకుతున్న‌ట్లు ఓ మ‌హిళ చెప్పారు. రెండు రోజులుగా వెతుకుతున్నా వ‌జ్రాలు దొర‌క‌లేద‌ని కానీ రంగురాళ్లు ల‌భిస్తున్నా పై పొర మ‌ట్టి తొల‌గించి నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని మ‌రో వృద్ధ దంప‌తులు వివ‌రించారు.

Paritala-Diamond-Hunt : పోలీసుల హెచ్చ‌రిక‌లు బేఖాత‌ర్‌…

రెండు రోజుల క్రితం పోలీసులు సెల్‌ఫోన్ల ద్వారా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అయిన‌ప్ప‌టికీ వందలాది మంది అన్వేషణను కొనసాగిస్తూనే ఉన్నారు. నెల్లూరు, ఒంగోలు, భీమవరం, గుడివాడ, తెనాలి, నరసరావుపేట తదితర ప్రాంతాల నుంచి ప్రజలు పోటెత్తుతున్నారు. తొలకరి వానల సమయంలో మట్టి పై పొర కొట్టుకుపోయి వజ్రాలు బయటపడే అవకాశం ఉందనే నమ్మకంతో ఇక్కడి ఆశావహులు ఉదయం తెల్లవారుజాము నుంచి చీకటి పడే వరకు వెతుకుతున్నారు. ఒక్క వజ్రం దొరికితే తమ కష్టాలన్నీ తీరిపోతాయనే ఆశలో వీరి వేట కొనసాగుతోంది