ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఉచిత సహాయం
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు మైనార్టీ నాయకులు, యువకుల సహకారం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో పట్టణ ప్రజలకు ఉచితంగా సహాయం అందిస్తున్నట్లు మైనార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల యువకులు తెలిపారు.
ఆదివారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని కమ్యూనిటీ హాల్‌లో ఎస్ఐఆర్ దరఖాస్తు ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అవసరమైన సహాయం అందించారు. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు, ఆన్‌లైన్ సేవలపై అవగాహన లేని వారికి ప్రత్యేకంగా సహకరిస్తున్నట్లు తెలిపారు.
ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారు కమ్యూనిటీ హాల్‌కు వచ్చి ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఎవరి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఇతర అవసరమైన పత్రాలతో రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, మైనార్టీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
