ల్యాప్‌టాప్‌ల కొనుగోలులో రూ.112 కోట్ల అవినీతి.. వైఎస్సార్సీపీ ఆరోపణ
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలు ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆరోపించారు. విద్యాశాఖ చేపట్టిన టెండర్లలో సుమారు రూ.112 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలోని 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల కంప్యూటర్ ల్యాబ్‌ల కోసం 27,672 ల్యాప్‌టాప్‌ల కొనుగోలు ప్రక్రియలో నిబంధనలను పక్కనపెట్టారని ఆయన ఆరోపించారు. టెండర్లను ముందే నిర్ణయించిన విధంగా శాన్‌బే సంస్థకు 70 శాతం, సెల్కాన్ సంస్థకు 30 శాతం కేటాయించారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, కొనుగోలు నిబంధనలను పాటించకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారని రవిచంద్ర విమర్శించారు. బహిరంగ మార్కెట్లో రూ.45 వేల నుంచి రూ.50 వేల మధ్య లభించే ల్యాప్‌టాప్‌లను ఒక్కోటి సుమారు రూ.89 వేల చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
దీంతో ఒక్కో ల్యాప్‌టాప్‌పై సుమారు రూ.40 వేల వరకు అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతోందని, మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
