గుంతలమయంగా మోడల్ స్కూల్ రోడ్డు

  • విద్యార్థులు, వాహనదారుల అవస్థలు
  • మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లక్కారం ఆదర్శ మోడల్ స్కూల్‌కు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వాటర్ పైప్‌లైన్ పనులు పూర్తి చేసిన అధికారులు, ఆ తర్వాత రోడ్డును సరిగ్గా లెవలింగ్ చేయకపోవడంతో దారి పొడవునా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ​ప్రతిరోజూ ఈ దారి గుండా విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. గుంతలమయమైన రోడ్డుపై ప్రయాణించడం వల్ల చిన్నారులకు నడుము నొప్పులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం పడితే బురదగా, ఎండ తీవ్రతకు దుమ్ము ధూళితో ఈ రోడ్డుపై రాకపోకలు సాగించడం దుర్భరంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. ​మోడల్ స్కూల్ రోడ్డుతో పాటు పాత ఎమ్మార్వో ఆఫీస్ నుండి లక్కారం గ్రామాలకు వెళ్లే ముఖ్య రహదారి కూడా బాగా డ్యామేజ్ అయిందని స్థానికులు తెలిపారు. ఈ రెండు కీలక రహదారుల పరిస్థితిపై విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​ అధికారులు స్పందించి తక్షణమే మోడల్ స్కూల్ రోడ్డుతో పాటు, లక్కారం వెళ్లే రహదారికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి తమ రవాణా కష్టాలను తీర్చాలని వాహనదారులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.