ఇంద్రకీలాద్రిపై వైభవంగా ‘ధర్మపథం’ సాంస్కృతిక కార్యక్రమం

భక్తులను అలరించిన నృత్య ప్రదర్శన

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు ఆధ్యాత్మిక భావనను పెంపొందించేలా నిర్వహిస్తున్న “ధర్మపథం” సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం జరిగిన నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం నుండి ప్రారంభమైన ఈ సాంస్కృతిక వేదికపై కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు నయనానందకరంగా సాగాయి.​విజయవాడకు చెందిన శ సత్యవాణి శిష్య బృందం అత్యంత ప్రతిభావంతంగా ఈ నృత్యార్చనను గావించారు.

దుర్గమ్మ సన్నిధిలో శాస్త్రీయ నృత్య రీతులతో దేవతా మూర్తులను కీర్తిస్తూ వారు చేసిన ప్రదర్శనలు తిలకించిన భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ​కార్యక్రమంలో భాగం గా కళాకారులు పలు ఆధ్యాత్మిక, భక్తి రస పూరిత కీర్తనలకు అద్భుతమైన అభినయాన్ని, నృత్య రీతులను జోడించి ప్రదర్శించారు.​విఘ్నేశ్వరుని స్తుతిస్తూ చేసిన ‘నర్తనగణపతం’ ​అమ్మవారి వైభవాన్ని చాటే ‘అన్నపూర్ణే విశాలాక్షి’ ​అలిమేలు మంగమ్మ వైభవాన్ని తెలిపే ‘వచ్చెను అలమేలు మంగ’ ​అన్నమయ్య సంకీర్తన ‘ఒకపరి కొకపరి’ ​వీటితో పాటు ‘నగుమోము’, ‘శివపంచాక్షరి’, ‘భో శంభో’, ‘పలుకే బంగారమాయెనా’ వంటి మొత్తం 12 విశిష్టమైన ఆధ్యాత్మిక అంశాలపై కళాకారులు అద్భుతంగా నృత్యం చేశారు. ​

దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సాంస్కృతిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి, కళాకారుల ప్రతిభను కరతాళ ధ్వనులతో అభినందించారు. ఆలయ అధికారులు ప్రదర్శన ఇచ్చిన కళాకారులను ఘనంగా సత్కరించి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.