పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన ఊదరి సుశీల–గోపాల్ దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, రానున్న రోజుల్లో గ్రామంలో ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సొంతింటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు ఊదరి సుశీల–గోపాల్ దంపతులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, మాజీ ఉపసర్పంచ్ కొంతం బుచ్చిరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు రాచకొండ వెంకటేశం, చెన్నోజు విజయ్ చారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊదరి నర్సింహ, స్వామి తదితరులు పాల్గొన్నారు.
