పోక్సో కేసు ఛేదించిన పోలీసులకు ఎస్పీ ప్రశంసలు
నిందితుడికి సహజ మరణం వరకు జైలు శిక్ష పడేలా దర్యాప్తు.. అధికారులకు ప్రశంసాపత్రాల ప్రదానం
తిరుపతి, ఆంధ్రప్రభ: వడమాలపేట పోక్సో హత్య కేసులో శాస్త్రీయ దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాలతో నేరాన్ని రుజువు చేసి నిందితుడికి సహజ మరణం వరకు కఠిన కారాగార శిక్ష పడేలా చేసిన దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. కేసు విచారణలో విశేష సేవలు అందించిన అధికారులు, పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.
వడమాలపేట పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో చిత్తూరు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి సహజ మరణం వరకు కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఈ కేసును ఘటన జరిగినప్పటి నుంచే ఎస్పీ సుబ్బరాయుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని స్వయంగా పర్యవేక్షించారు. పుత్తూరు డీఎస్పీ జి. రవికుమార్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం సంఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేసింది. అనంతరం శాస్త్రీయ ఆధారాలను సేకరించి, సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయడంతో కోర్టులో నేరం రుజువై నిందితుడికి కఠిన శిక్ష పడింది.
ఈ సందర్భంగా డీఎస్పీ జి. రవికుమార్, ఇన్స్పెక్టర్ సి. వెంకటేష్, ఎస్ఐ కె. ధర్మారెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు జె. రమణరాజు, బి. గిరీష్బాబు, కానిస్టేబుళ్లు కె. ఓంకార్, ఎన్. వెంకటమునిలకు జిల్లా ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గట్టి హెచ్చరిక అని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు.
