గ్రామీణ ఉపాధికి కొత్త ఊపు..

125 రోజుల పనికి శ్రీకారం

రోజువారీ కూలీ రూ.312కు పెంపు..

తిరుపతి జిల్లాలో రూ.175 కోట్లతో 4,627 పనులు కొనసాగింపు

తిరుపతి, ఆంధ్రప్రభ: గ్రామీణ కుటుంబాలకు ఉపాధి, జీవనోపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (వీబీజీ రామ్‌జీ) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి డ్వామా కార్యాలయంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమం అమలు తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇషా సింగ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి ఉపాధి అవకాశాలు అందేలా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, గ్రామస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు.

అనంతరం డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంసీ మద్దిలేటి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంతో పోలిస్తే వీబీజీ రామ్‌జీ కార్యక్రమంలో పలు మెరుగైన విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక కుటుంబానికి కల్పించే పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు చెప్పారు. చేపట్టే పనులను నాలుగు విభాగాలుగా విభజించడంతో పాటు వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరత తలెత్తకుండా ప్రతి సంవత్సరం 60 రోజుల పాటు పనులకు విరామం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే రోజువారీ కూలీని రూ.307 నుంచి రూ.312కు పెంచినట్లు తెలిపారు.

తిరుపతి జిల్లాలో ప్రస్తుతం రూ.175 కోట్ల అంచనా వ్యయంతో 4,627 పనులు కొనసాగుతున్నాయని, మరో రూ.113 కోట్ల విలువైన 5,066 పనులు మంజూరు దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలో 2.39 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 3.12 లక్షల మంది క్రియాశీల ఉపాధి కూలీలు ఉన్నట్లు వెల్లడించారు. వేతనాలను సకాలంలో చెల్లిస్తున్నామని, ఈ-కేవైసీ ప్రక్రియ 91.99 శాతం పూర్తయిందని వివరించారు. జూన్ నెలకు సంబంధించిన మూడు వారాల వేతనాల చెల్లింపులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

జూలై 1 నుంచి జిల్లాలో వీబీజీ రామ్‌జీ కింద 986 కొత్త పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌ఎంఎంఎస్ హాజరు నమోదు కూడా క్రమంగా పెరుగుతోందని వెల్లడించారు. జూలై 1న 13,709 మంది హాజరు నమోదు కాగా, జూలై 8న అత్యధికంగా 47,288 మంది, జూలై 10 నాటికి 46,547 మంది హాజరైనట్లు తెలిపారు. తొలి వారంలోనే 94 వేల పని దినాలు కల్పించినట్లు వివరించారు. గ్రామాలు, పని ప్రదేశాల్లో నిర్వహిస్తున్న వారపు రోజ్‌గార్ దివస్ కార్యక్రమాల ద్వారా ఉపాధి కూలీలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఈ సదస్సులో ఐఈఎస్ సెక్షన్ ఆఫీసర్ ఆశా వహానే, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, జూనియర్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.