TG Engineers Day | తెలంగాణ ఇంజనీర్లకు శుభాకాంక్షలు
నవాజ్ జంగ్‌కు సీఎం రేవంత్ నివాళి
TG Engineers Day | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పనతో పాటు పలు చారిత్రక నిర్మాణాలకు మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇంజనీర్లందరికీ ముఖ్యమంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ముందుకు నడిపించే శక్తి ఇంజనీర్ల ఆలోచనల్లోనే ఉంటుందని అన్నారు. వారి ప్రతిభ, సృజనాత్మకత, అంకితభావం వల్లే అసాధ్యంగా అనిపించే ఎన్నో లక్ష్యాలు సాకారమవుతున్నాయని కొనియాడారు. ప్రతి సమస్యను అవకాశంగా మార్చే దృక్పథం, ప్రతి సవాలుకు వినూత్న పరిష్కారాలను అందించే నైపుణ్యం ఇంజనీర్ల ప్రత్యేకత అని పేర్కొన్నారు. “ఇంజనీర్ ఆలోచనలో భవిష్యత్తు ఉంటుంది.. ప్రతి నిర్మాణంలో సమాజ ప్రగతి ఉంటుంది” అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్లు ఇదే స్ఫూర్తితో మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.
