సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలనే ప్రోత్సహించాలి
– డీఎంహెచ్‌వో డా. విజయమ్మ
బాపట్ల, ఆంధ్రప్రభ : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాపట్ల ఏరియా వైద్యశాలలో గల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సూరతాని విజయమ్మ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి బయలుదేరిన ర్యాలీ ప్రధాన కూడలి మీదుగా ప్రజలకు కుటుంబ సంక్షేమం, తల్లి–శిశు ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకుంది. వైద్య సిబ్బంది, పేర్లీ సునీల్ కుమార్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు నారాయణ బట్టు, సిబ్బంది మానవహారంగా ఏర్పడి ప్రపంచ జనాభా దినోత్సవ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్ విజయమ్మ మాట్లాడుతూ, గతంలో ప్రచారంలో ఉన్న ఇద్దరు పిల్లలే ముద్దు అనే నినాదం స్థానంలో ప్రస్తుతం పిల్లల మధ్య కనీసం మూడు సంవత్సరాల వ్యవధి ఉండేలా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. పిల్లల మధ్య తగిన విరామం ఉండటం వల్ల తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మాతా–శిశు మరణాల తగ్గుదలకు దోహదపడుతుందని తెలిపారు. అనవసర సిజేరియన్ ప్రసవాలను తగ్గించి, వైద్యపరంగా సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు.
అలాగే కాపర్-టీ, గర్భనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు వంటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు. అనధికార స్కానింగ్ కేంద్రాలను ఆశ్రయించి గర్భస్రావాలు చేయించుకోవద్దని, అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అర్హత కలిగిన గైనకాలజిస్టులను సంప్రదించి వైద్య సలహాలు, సేవలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మలేరియా అధికారి నాగార్జున రావు గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లలిత రాజేశ్వరి, డాక్టర్ మౌనిక, సి హెచ్ ఓ డాక్టర్ మల్లికార్జున రావు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
