బాపట్ల ఆర్టీసీ డిపోకు 40 ఎలక్ట్రిక్ బస్సులు..

  • వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి: ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : బాపట్ల ఆర్టీసీ డిపోను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. బాపట్ల కొత్త ఆర్టీసీ బస్టాండ్‌లో డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 1,800 ఎలక్ట్రిక్ బస్సుల్లో బాపట్ల డిపోకు 40 బస్సులు కేటాయించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని, కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు చెప్పారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు డిపోలో అవసరమైన అన్ని సదుపాయాలను వచ్చే ఆరు నెలల్లో మెరుగుపరుస్తామని తెలిపారు. బస్టాండ్ పరిసరాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు డిపో చుట్టూ ప్రహరీ గోడ ఎత్తు పెంచడం, పచ్చదనాన్ని అభివృద్ధి చేయడం వంటి పనులు చేపడతామని పేర్కొన్నారు.

గతంలో రద్దు చేసిన దూర ప్రాంత బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. డిపో అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు.

వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి విమల, టీడీపీ నాయకులు మందపాటి ఆంధ్రేయ, జిట్టా శ్రీనివాసరావు, గొలపల శ్రీనివాసరావు, ఫరీద్ మస్తాన్, పల్లం సరోజిని, బీజేపీ నాయకుడు బాల నారాయణ, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.