మాతా శిశు ఆసుపత్రిలో శాశ్వత గైనకాలజిస్ట్‌ను నియమించాలి
- బీఆర్ఎస్ మహిళా విభాగం ఒకరోజు నిరసన దీక్ష
మంథని, ఆంధ్రప్రభ : మంథని మాతా శిశు ఆసుపత్రిలో శాశ్వత గైనకాలజిస్ట్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించారు.
మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా విభాగం, మున్సిపల్ విభాగం ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంథని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన మాతా శిశు ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత గైనకాలజిస్ట్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో బీఆర్ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గులాబీ కండువాలు ధరించి ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్‌ను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమవుతామని పుట్ట శైలజ స్పష్టం చేశారు.
