అడుగు అడుగునా గుంత… ఇంటికి చేరాలంటే చింత
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్గల్ నుంచి సిరికొండ వరకు వెళ్లే ప్రధాన బీటీ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు నిత్యం నరకయాతన కలిగిస్తోంది. అడుగు అడుగునా ఏర్పడిన భారీ గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, బస్సులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తుండటంతో ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ప్రమాదాల భయం వెంటాడుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రహదారికి ఇప్పటివరకు సరైన మరమ్మతులు చేపట్టకపోవడంతో వర్షాకాలంలో గుంతలు మరింత విస్తరించాయి.
చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు నిలిచి లోతు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించడం ప్రాణాలకు తెగించి వెళ్లినట్టేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి ద్వారా ముచ్కూర్, సిరికొండతో పాటు పలు గ్రామాల ప్రజలు నిత్యం భీమ్గల్కు రాకపోకలు సాగిస్తుంటారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేందుకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు చేరుకునేందుకు, అత్యవసర వైద్య సేవల కోసం కూడా ఇదే ప్రధాన మార్గం కావడంతో రహదారి దుస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
స్థానికుల అభిప్రాయం ప్రకారం, కేజ్ వీల్స్ (ఇనుప చక్రాలు) అమర్చిన ట్రాక్టర్లు అధికంగా తిరగడం కూడా రహదారి త్వరగా దెబ్బతినడానికి ఒక కారణంగా మారింది. దీనిపై సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఒకప్పుడు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి స్వగ్రామం ముచ్కూర్కు వెళ్లే రహదారి ఇదే కావడం, ఇంత దయనీయంగా ఉండడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ వంటి కీలక నాయకులు ఉన్నప్పటికీ రహదారి సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, తాత్కాలికంగా గుంతలు పూడ్చడం కాకుండా నాణ్యమైన రీతిలో రహదారిని పునర్నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత రోడ్లు-భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
