స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సద్వినియోగం చేసుకోండి
- ప్రపంచ మార్కెట్లలో భారత పరిశ్రమలకు ఎఫ్‌టీఏలతో భారీ అవకాశాలు
- సీఐఐ విజయవాడలో ఎఫ్‌టీఏలపై అవగాహన సదస్సు
- ఎగుమతులు, పెట్టుబడులకు ఎఫ్టీఏలే కీలకం: నిపుణులు
- యూకే, యూఏఈ, ఈయూ, ఆస్ట్రేలియాతో కొత్త మార్కెట్లు
- రూల్స్ ఆఫ్ ఒరిజిన్, నాణ్యతతో పోటీతత్వం పెంపు
- ఎంఎస్ఎంఈలు, ఎగుమతిదారులు అవకాశాలు వినియోగించుకోవాలి
విజయవాడ, ఆంధ్రప్రభ: భారతదేశం కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) ప్రపంచ మార్కెట్లలో భారత పరిశ్రమలకు అపూర్వ అవకాశాలను కల్పిస్తున్నాయని, ఎగుమతులు, పెట్టుబడులు, ప్రపంచ విలువ గొలుసుల్లో భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు పరిశ్రమలు వీటిని సమర్థంగా వినియోగించుకోవాలని నిపుణులు సూచించారు.
శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) విజయవాడ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా పెరుగుతున్న అవకాశాలు” అంశంపై అవగాహన సదస్సులో ఎగుమతిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, ఎంఎస్ఎంఈలు, లాజిస్టిక్స్ సంస్థలు, వాణిజ్య నిపుణులు పాల్గొన్నారు.
సీఐఐ అంతర్జాతీయ వాణిజ్య విధానాల ప్రధాన సలహాదారు సుమంత్ చౌదరి మాట్లాడుతూ.. నేటి ఎఫ్‌టీఏలు కేవలం దిగుమతి–ఎగుమతి ఒప్పందాలకే పరిమితం కాకుండా పెట్టుబడులు, డిజిటల్ వాణిజ్యం, సాంకేతికత, సరఫరా గొలుసుల బలోపేతానికి దోహదపడే వ్యూహాత్మక భాగస్వామ్యాలుగా మారాయని చెప్పారు. ‘రూల్స్ ఆఫ్ ఒరిజిన్’ నిబంధనలు, అంతర్జాతీయ ప్రమాణాలపై పరిశ్రమలు పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.
సీఐఐ విజయవాడ చైర్మన్ అభినవ్ కోటగిరి మాట్లాడుతూ.. యూఏఈ, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న ఎఫ్‌టీఏలు కొత్త మార్కెట్లను తెరవడంతో పాటు ఎగుమతులు, పెట్టుబడులు, పోటీతత్వాన్ని మరింత పెంచుతాయని తెలిపారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ప్రొఫెసర్ డాక్టర్ మురళి కల్లుమల్ మాట్లాడుతూ.. యూకే, యూరోపియన్ యూనియన్, యూఏఈ, ఒమన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో కుదురుతున్న ఒప్పందాల ద్వారా భారత పరిశ్రమలకు 97 నుంచి 100 శాతం వరకు ప్రాధాన్య మార్కెట్ ప్రవేశ అవకాశాలు లభిస్తాయని వివరించారు. విలువ జోడించిన ఉత్పత్తులకు సుంక రాయితీలు కూడా లభించే అవకాశముందని తెలిపారు.
ఎంపెడా ఉప సంచాలకులు డాక్టర్ ఆనంద్ గోపాల్ మాట్లాడుతూ.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలు, ట్రేసబిలిటీ, నాణ్యత ధృవపత్రాలను పాటిస్తే ఎఫ్‌టీఏల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందవచ్చన్నారు.
ఏపీడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్.పీ. నాయుడు మాట్లాడుతూ.. ముడి ఉత్పత్తుల కంటే విలువ జోడించిన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని సూచించారు. ప్రాసెస్డ్ ఫుడ్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త ఎఫ్‌టీఏల ద్వారా విస్తృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
