జిల్లాలో 77.88 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తి

కలెక్టర్ లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ జిల్లాలో 77.88 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని కొనసాగించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 13,34,504 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందన్నారు.

నియోజకవర్గాల వారీగా తిరువూరులో 86.25 శాతం, విజయవాడ పశ్చిమలో 71.52 శాతం, విజయవాడ సెంట్రల్‌లో 72.89 శాతం, విజయవాడ తూర్పులో 74.18 శాతం, మైలవరంలో 81.07 శాతం, నందిగామలో 81.32 శాతం, జగ్గయ్యపేటలో 81.04 శాతం ఫారాల డిజిటైజేషన్ పూర్తైనట్లు వివరించారు.

ప్రతి నియోజకవర్గంలో బీఎల్‌వోలతో పాటు హెల్ప్‌డెస్కులు అందుబాటులో ఉన్నాయని, ఓటర్ హెల్ప్‌లైన్-1950 సేవలను కూడా వినియోగించుకోవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు విశేష కృషి చేస్తున్నారని, వారికి అధికారులు అన్ని విధాలా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఫారాల సమర్పణలో బీఎల్‌ఏలు కూడా ఓటర్లను ప్రోత్సహించాలని సూచించారు.

సమావేశంలో డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం, టీడీపీ ప్రతినిధులు వై. రామయ్య, కె. రాజేష్, బీజేపీ ప్రతినిధి తరుణ్ కాకాని, జనసేన ప్రతినిధి జె. శ్రీనివాస్, సీపీఐ(ఎం) ప్రతినిధి డీవీ కృష్ణ, వైఎస్సార్సీపీ ప్రతినిధి వై. ఆంజనేయరెడ్డి, బీఎస్పీ ప్రతినిధి పవన్ కార్తీక్, ఆప్ ప్రతినిధి పి. హరికృష్ణ పాల్గొన్నారు.