వృద్ధురాలికి అండగా ఎమ్మెల్యే బొండా ఉమా

పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మానవత్వాన్ని చాటుకున్నారు. పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్న ఓ వృద్ధురాలి సమస్య తెలుసుకుని, తన సొంత నిధులతో ప్రతి నెలా పెన్షన్ అందజేస్తానని హామీ ఇచ్చారు.

శుక్రవారం సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద న్యూ రాజరాజేశ్వరి పేటకు చెందిన కొట్ట రంగమ్మ అనే వృద్ధురాలు తన సమస్యను బొండా ఉమా దృష్టికి తీసుకెళ్లింది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, టీడీపీ ప్రభుత్వం అందించే పెన్షన్‌కు సమానంగా రూ.4 వేల నగదును తన సొంత నిధుల నుంచి అందజేశారు.

అంతేకాకుండా, ప్రతి నెలా ఇదే విధంగా తన కార్యాలయానికి వచ్చి పెన్షన్ తీసుకెళ్లాలని ఆమెకు భరోసా ఇచ్చారు. దీంతో భావోద్వేగానికి గురైన రంగమ్మ కన్నీటి పర్యంతమై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వదించింది. ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే బొండా ఉమా వెంటనే స్పందించి పరిష్కారం చూపుతున్న తీరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.