science | సమాధానం తెలిస్తే షాక్ అవుతారు!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మన శరీరంలో ఎక్కడైనా చిన్న గాయమైనా.. ఆ బాధను మనం వెంటనే అనుభవిస్తాం.. కానీ ఓ అవయవానికి మాత్రం అసలు నొప్పిని అనుభవించదని మీకు తెలుసా..? అవునండీ నిజం మానవ శరీరంలో ఎక్కడైనా గాయం అయితే నొప్పి వస్తుంది. కాలు తగిలినా, చేయి కోసుకున్నా, పంటి నొప్పి వచ్చినా వెంటనే ఆ నొప్పి తీవ్రతను, బాధను అనుభవిస్తాం. అయితే మన శరీరంలో ఒక అత్యంత ముఖ్యమైన అవయవం మాత్రం స్వయంగా నొప్పిని అనుభవించదంటా.. అదే మెదడు (Brain).
ఈ విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగింస్తుందిఇ. ఎందుకంటే మనం తలనొప్పిని అనుభవిస్తాం కాదా అనేగా మీ డౌట్. తల నొప్పి పుడుతుంటే మెదడే నొప్పి పడుతోందని అనుకుంటాం. కానీ వైద్య శాస్త్రం ప్రకారం.. మెదడు కణజాలం (Brain Tissue)లో నొప్పిని గుర్తించే ప్రత్యేక నర గ్రాహకాలు ఉండవంట. అందువల్ల మెదడు స్వయంగా నొప్పిని గుర్తించదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నొప్పి అంటే అసలు ఏమిటి?
శరీరంలో గాయం లేదా ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక నర గ్రాహకాలు ఆ సంకేతాలను మెదడుకు పంపిస్తాయి. మెదడు వాటిని విశ్లేషించి “నొప్పి”గా మనకు అనిపించేలా చేస్తుంది. అంటే మెదడే నొప్పిని అర్థం చేసుకుంటుంది కానీ తనకు తానే నొప్పిని అనుభవించదు.
మరి తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇదే చాలా మందికి వచ్చే సందేహం. తలనొప్పి వచ్చినప్పుడు నొప్పి మెదడులో కాదు. మెదడును చుట్టుముట్టే భాగాల్లో ఉంటుంది. ఉదాహరణకు:
- మెదడును కప్పి ఉంచే పొరలు (Meninges)
- తలలోని రక్తనాళాలు
- మెడ, తల కండరాలు
- నరాలు
- కళ్ల చుట్టూ ఉండే కణజాలం
- సైనస్ ప్రాంతం
ఈ భాగాల్లో నొప్పి గ్రాహకాలు ఉండటంతో అవి ఉత్తేజితమైతే మనకు తలనొప్పి అనిపిస్తుంది.
మెదడుపై శస్త్రచికిత్స సమయంలో రోగి మేల్కొని ఉండటం నిజమేనా?
మెదడుపై శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు రోగి మేల్కొని ఉండటాన్ని అవేక్ బ్రెన్ సర్జరీ (Awake Brain Surgery) అంటారు. కొన్ని రకాల మెదడు శస్త్రచికిత్సల్లో రోగి పూర్తిగా మత్తులో కాకుండా మేల్కొని ఉండేలా వైద్యులు ఆపరేషన్ చేస్తారు. కారణం, మెదడు కణజాలానికి నొప్పి తెలియదు. అయితే తల చర్మం, పుర్రె వంటి భాగాలకు మత్తుమందు ఇస్తారు. శస్త్రచికిత్స సమయంలో రోగితో మాట్లాడిస్తూ.. చేతులు, కాళ్లు కదిలించమని చెప్పడం ద్వారా మెదడులోని ముఖ్యమైన ప్రాంతాలు దెబ్బతినకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటారు.
మెదడు గురించి ఆశ్చర్యకరమైన నిజాలు
- మెదడు శరీర బరువులో సుమారు 2 శాతం మాత్రమే ఉంటుంది.
- శరీరం వినియోగించే ఆక్సిజన్, శక్తిలో సుమారు 20 శాతం వరకు ఉపయోగిస్తుంది.
- మన మెదడులో దాదాపు 86 బిలియన్ల నాడీ కణాలు (Neurons) ఉంటాయి. ఇవి పరస్పరం అనేక కనెక్షన్ల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేస్తాయి.
- మనం నిద్రపోయినా మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోదు. జ్ఞాపకాలను క్రమబద్ధీకరించడం, శరీరంలోని కీలక వ్యవస్థలను నియంత్రించడం వంటి పనులు కొనసాగుతూనే ఉంటాయి.
- ఆలోచనలు, జ్ఞాపకశక్తి, మాట, కదలికలు, భావోద్వేగాలు, గుండె స్పందన, శ్వాస, శరీర ఉష్ణోగ్రత వంటి అనేక కీలక కార్యకలాపాలను మెదడు నియంత్రిస్తుంది.
నొప్పి రాకపోవడం మంచిదేనా?
నొప్పి అనేది శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతం. శరీరంలో ఏదైనా గాయం, ఇన్ఫెక్షన్ లేదా సమస్య ఉన్నప్పుడు నొప్పి ద్వారా మనకు సమాచారం అందుతుంది. అందుకే నొప్పి కూడా శరీర రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది.
