sharmila |అప్రమత్తం కావాలని ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి
sharmila |అప్రమత్తం కావాలని ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి
కోవిడ్ లక్షణాలతో కేసులు, మరణాల వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్య
జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీసిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు
ప్రత్యేక వార్డులు, పరీక్షలు, ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచన
ఆంధ్ర్రప్రభ వెబ్‌డెస్క్ : కడప జిల్లాలో ఇటీవల కోవిడ్-19 లక్షణాలతో కూడిన కేసులు నమోదవడంతో పాటు కొందరికి వైరస్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే అంశమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కోవిడ్ పాజిటివ్ కేసులతో పాటు మరణాలు సంభవించాయన్న వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయని ఆమె పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం కడప జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిపై సమగ్ర సమాచారం తెలుసుకున్నట్లు షర్మిల వెల్లడించారు. వైరస్ తీవ్రత, జిల్లాలో వైద్య యంత్రాంగం సన్నద్ధత, తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె పలు సూచనలు చేశారు. కోవిడ్ వ్యాప్తి మరింత పెరగకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, లక్షణాలు ఉన్నవారిని త్వరగా గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన చోట ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సేవలను బలోపేతం చేయాలని కోరారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజల్లో అప్రమత్తత కల్పించాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన సహాయసహకారాలు అందించాలని, స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కోవిడ్ మళ్లీ విజృంభించకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని షర్మిల పిలుపునిచ్చారు.
