ధరణి అక్రమాలపై డేగ కన్ను.. వేల ఎకరాల భూ అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు
ధరణి అక్రమాలపై డేగ కన్ను.. వేల ఎకరాల భూ అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు
- ధరణి లావాదేవీలపై రీ-చెక్‌కు ప్రభుత్వం సిద్ధం
- వేల ఎకరాల భూముల హక్కుల మార్పులపై అనుమానాలు
- ధరణి ఆపరేటర్లు, అధికారులకు నోటీసులు.. పలువురు అదుపులో
- మంత్రి, సీఎంకు నివేదిక.. అక్రమాలపై కఠిన చర్యలకు రంగం సిద్ధం
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన 2020 సంవత్సరం నుంచి జరిగిన అనుమానాస్పద భూ లావాదేవీలను ప్రత్యేక విధానంతో రీ-చెక్ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో జరిగిన అన్ని మ్యుటేషన్లు, యాజమాన్య హక్కుల మార్పులు, నిషేధిత జాబితాలోని భూముల బదిలీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగిన మార్పులపై ప్రత్యేక దృష్టి సారించారు.
అత్యంత పకడ్బందీ సాఫ్ట్‌వేర్‌తో ఎవరు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎవరి లాగిన్‌తో మార్పులు జరిగాయి, ఏ మాడ్యూల్‌ను ఎవరు ఎప్పుడు ఆపరేట్ చేశారనే సమగ్ర వివరాలను గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఎకరాల భూముల హక్కులు అనుమానాస్పదంగా మారినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కూడా ఆక్రమంగా బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విచారణలో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అక్రమాల లింకులు ఉన్నట్లు గుర్తిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు, ధరణి ఆపరేటర్లు, మాజీ ఆపరేటర్లు, దళారులు, మరికొందరు కీలక వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. వీరందరికీ నోటీసులు జారీ కానున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల దారిమళ్లింపు వ్యవహారం వెలుగుచూడగా, సుమారు 4,100 లావాదేవీలను అధికారులు అనుమానాస్పదంగా గుర్తించారు. కొన్ని జిల్లాల్లో భూముల హక్కులు గుట్టుగా మారిన కేసులు కూడా విచారణలో ఉన్నాయి.
ప్రాథమిక విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ధరణి ఆపరేటర్లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న అనుమానితుల నుంచి కీలక సమాచారం లభించడంతో, అక్రమాల వెనుక ఉన్న నెట్‌వర్క్పై అధికారులు మరింత దృష్టి పెట్టారు.
మంత్రికి చేసిన నివేదిక
ధరణి అక్రమాలపై ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలతో కూడిన నివేదికను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అధికారులు సమర్పించినట్లు సమాచారం. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి తహసీల్దార్ సుజాతను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. భూముల పోర్టల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ 56 దస్త్రాలను ఆమోదించడం, అసైన్డ్ భూముల వారసత్వ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో సుమారు 448 ఎకరాల భూముల హక్కుల్లో మార్పులు జరిగినట్లు గుర్తించారు.
సిట్ ఏర్పాటు అనంతరం ధరణి పోర్టల్‌కు సంబంధించిన గత కొన్నేళ్ల భూ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించి, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
10 వేల ఎకరాలు కొట్టేసిన ఘనులు
ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకుని 10 వేల ఎకరాల అక్రమాలు చోటుచేసుకున్నాయి. పోర్టల్‌లోని లొసుగుల ఆధారంగా విలువైన భూములున్న ప్రాంతాల్లో వేల ఎకరాలకు సంబంధించిన హక్కులను దొడ్డిదారిన మార్చేశారు.
ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ భూదోపిడీకి సీసీఎల్ఎకు చెందిన ఇద్దరు సహా జిల్లాల్లో కొందరు సహకరించినట్లు తేల్చారు. పోలీసులు పలువురు అక్రమార్కులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పట్టా భూముల్లోనూ దోపిడీ
ఎసైన్డ్, ప్రభుత్వ, మిగులు, భూదాన్ భూములతో పాటు వివాదాల్లో ఉన్న పట్టా భూముల్లోనూ వేల ఎకరాల దోపిడీ జరిగినట్లు తేల్చారు. ధరణిలో సాధారణంగా జరిగే ప్రక్రియ లేకుండా, దస్త్రాలు లేకుండానే భూములపై యాజమాన్య హక్కులు మారినట్లు పలు జిల్లాల్లో కలెక్టర్ల దృష్టికి వచ్చింది.
దీనిపై సాంకేతిక, రెవెన్యూ చట్టాల నిపుణులతో అధ్యయనం చేయించి, సైబర్ క్రైమ్, ఐటీ విభాగాలతో పరిశీలింపజేసిన ప్రభుత్వం పెద్దఎత్తున భూముల హక్కులు దారి మళ్లినట్లు గుర్తించింది.
పాత సాఫ్ట్‌వేర్‌లోనూ హక్కుల మార్పులు
మేడ్చల్ జిల్లా రావెల్కోల్లో నాలుగు పార్శిళ్లలో భూములు ఇతరుల పేర్లపైకి మారినట్లు గుర్తించారు. ఒకచోట 16 ఎకరాలు, మరోచోట 15.28 ఎకరాలు ఇతరుల పేర్లపైకి మారినట్లు తేల్చారు.
రంగారెడ్డి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కూడా ఇలాంటి అక్రమాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తం వ్యవహారంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కీలక వ్యక్తి, నిజామాబాద్ జిల్లాకు చెందిన కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న మరో వ్యక్తి సహకారంతో భూములపై హక్కుల మార్పిడి జరిగినట్లు తెలిసింది. ధరణి పోర్టల్ భూభారతిగా మారిన తర్వాత కూడా పాత సాఫ్ట్‌వేర్ కొనసాగుతున్న సమయంలో హక్కులను మార్చినట్లు అనుమానిస్తున్నారు.
ధరణి ఆపరేటర్లకు నోటీసులు
విచారణ బృందం గుర్తించిన అనుమానితుల్లో కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మాజీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. పలు ఆన్‌లైన్ కేంద్రాల నిర్వాహకులు, గ్రామస్థాయి సిబ్బంది, దళారులు కూడా ఈ ముఠాలో ఉన్నట్లు తెలిసింది. వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఆన్‌లైన్‌లో ఎలాంటి దరఖాస్తులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలను గుర్తించారు. ఇందుకు బాధ్యులైన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లకు పలు జిల్లాల కలెక్టర్లు నోటీసులు అందజేసినట్లు తెలిసింది.
భూ అక్రమాలపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ, సైబర్ క్రైమ్ తదితర విభాగాలతో ఏర్పడిన విచారణ బృందం అక్రమార్కుల గుట్టు వెలికితీస్తోంది. ఈ అక్రమాల కోసం ఉపయోగించిన డిజిటల్ లాగిన్లు, అక్రమ లావాదేవీల ఫుట్‌ప్రింట్లను సైబర్ నిపుణులు పరిశీలిస్తున్నారు.
