కొప్పుల ఈశ్వర్‌కు దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం
వికారాబాద్, ఆంధ్రప్రభ: భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింహులు గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి దివ్యాంగుల ప్రధాన సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కావలి నర్సింహులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకంగా దివ్యాంగుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే దివ్యాంగుల సమస్యలను మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన విమర్శించారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయడం, పెన్షన్ పెంపు వంటి అంశాల్లో ప్రభుత్వం ముందడుగు వేయలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పెంచిన పెన్షనే ప్రస్తుతం అందుతోందని తెలిపారు.
దివ్యాంగుల సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే అవకాశం కల్పించాలని కొప్పుల ఈశ్వర్‌ను కోరినట్లు నర్సింహులు వెల్లడించారు. అనంతరం తెలంగాణ భవన్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
