బాలనగర్‌లో పులి సంచారం వార్తలు అవాస్తవం..

బాలనగర్‌లో పులి సంచారం వార్తలు అవాస్తవం..

  • ప్రజలు పుకార్లను నమ్మొద్దు: ఎఫ్‌ఆర్‌వో

బాలనగర్, ఆంధ్రప్రభ : బాలనగర్ మండలంలో పులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఈ మేరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌వో) రాజేందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పులి కనిపించిందని ప్రచారం జరిగిన ప్రాంతాలను అటవీ శాఖ సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా పులి జాడలు లేదా సంచారానికి సంబంధించిన ఆధారాలు లభించలేదని తెలిపారు.

మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఏ ప్రాంతంలోనూ పులి సంచరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు పుకార్లను నమ్మి భయాందోళనలకు గురికావద్దని సూచించారు.

అలాగే తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయమై బాలనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు వెల్లడించారు.

అడవి జంతువుల సంచారానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం ఎవరైనా గమనిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. అడవి జంతువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని, వాటి భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

బాలనగర్ ప్రాంతంలో పులి సంచారం లేదని మరోసారి స్పష్టం చేసిన ఎఫ్‌ఆర్‌వో, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించవద్దని సూచించారు.

Leave a Reply