వేదాంతపురం 250 కాలనీలో భూ వివాదం.. ఉద్రిక్తత
స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారంటూ ఆరోపణలు..
అడ్డుకున్న కాలనీ వాసులు.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ
తిరుపతి రూరల్, జులై 9 (ఆంధ్రప్రభ): తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ పరిధిలోని 250 కాలనీలో గురువారం భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కాలనీలో ప్రజల వినియోగంలో ఉన్న స్థలాన్ని కొందరు రాజకీయ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆరోపించారు. దీనిని కాలనీ వాసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
కాలనీలోని స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు కొందరు టీడీపీ, వైసీపీ నాయకులు ప్రయత్నించారని స్థానికులు ఆరోపించారు. దీనికి నిరసనగా కాలనీ వాసులు మూకుమ్మడిగా అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అడ్డుకున్న వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కూడా కాలనీ వాసులు ఆరోపించారు.
వివాదం విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ చెరకుల జనార్ధన్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని కాలనీ వాసులకు మద్దతుగా నిలిచారు. ప్రజలందరికీ ఉమ్మడిగా ఉపయోగపడాల్సిన భూమిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించేందుకు ప్రయత్నించడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు స్థానికులు తెలిపారు.
వివాదం సందర్భంగా కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు కేటాయించిన భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రాజకీయ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా పేదలకు రక్షణ, నివాస హక్కుల కల్పనలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సంబంధిత భూమిపై రెవెన్యూ అధికారులు హక్కులను నిర్ధారించిన తర్వాతే ఎలాంటి పనులు చేపట్టాలని ఇరు వర్గాలకు సూచించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగి ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
