AAP | పెట్రోల్ ధరను రూ. 82కు తగ్గించాలి.. కేంద్రానికి కేజ్రీవాల్ డిమాండ్

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశంలో పెట్రోల్ ధరలను తగ్గించి ఒక లీటర్ స్వచ్ఛమైన పెట్రోల్‌ను రూ.82కే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పలుమార్లు తగ్గినా, ఆ ప్రయోజనం ప్రజలకు అందలేదని ఆయన విమర్శించారు.

2014 నుంచి ఇప్పటివరకు ముడి చమురు ధరలు ఆరు సార్లు తగ్గినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంలో విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గత ఏడాది ప్రభుత్వరంగ చమురు కంపెనీలు రూ.77 వేల కోట్లకు పైగా లాభాలు ఆర్జించాయని, అయినప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికీ లీటర్ పెట్రోల్ రూ.102కు విక్రయిస్తున్నారని ఆయన విమర్శించారు.

పెట్రోల్ ధరలను తగ్గించి లీటర్‌కు రూ.82కే అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు. ఇంధన ధరలు తగ్గితే రవాణా వ్యయంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.