ప్రజాకేంద్రిత పాలనలో ఎన్టీఆర్ జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు..
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీ శ
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజాకేంద్రిత పాలన, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ, వినూత్న కార్యక్రమాల అమలులో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. 2025, 2026 సంవత్సరాల్లో జిల్లాలోని ముప్పాళ్ళ, నిడమానూరు, అంబాపురం, గొల్లపూడి, గుంటుపల్లి, గూడవల్లి గ్రామపంచాయతీలు సహా మొత్తం తొమ్మిది గ్రామపంచాయతీలు గ్రామపంచాయతీ అవార్డులు అందుకున్నాయని తెలిపారు. అలాగే “వికాస్ సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ – ఎన్టీఆర్ వికాస్” కార్యక్రమానికి 2025లో స్కోచ్ సిల్వర్ అవార్డు, “ఇగ్నైట్ సెల్” కార్యక్రమానికి 2026లో స్కోచ్ గోల్డ్ అవార్డు లభించాయని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టరేట్‌కు హరితీకరణ, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు చర్యలు, ప్రజా సేవల నాణ్యతకు గుర్తింపుగా మూడు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు లభించాయని తెలిపారు. అలాగే ఎకో ఫ్రెండ్లీ గణేష్, యోగాంధ్ర–2025 కార్యక్రమాలకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు, యోగా ప్రాచుర్యానికి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సర్టిఫికెట్ లభించడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. ఈ అవార్డులు జిల్లా యంత్రాంగం సమిష్టి కృషి, ప్రజాప్రతినిధుల సహకారం, ప్రజల భాగస్వామ్యానికి దక్కిన గుర్తింపని పేర్కొన్న కలెక్టర్, భవిష్యత్తులోనూ పారదర్శక, సమర్థవంతమైన ప్రజా పరిపాలనతో ఎన్టీఆర్ జిల్లాను దేశానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ అవార్డులను గురువారం కలెక్టరేట్ లో ఇంచార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించి కలెక్టర్ కు, టీం ఎన్టీఆర్ కు అభినందనలు తెలిపారు.
