ప్రతి వాహనానికి రిఫ్లెక్టర్లు తప్పనిసరి

  • క్యూఆర్ ఆధారిత రేడియం స్టిక్కర్లే వినియోగించాలి
  • మైనర్ వాహనం నడిపితే.. 25 ఏళ్లు వచ్చే వరకు నో లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • జయశంకర్ జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్

ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు వాహన భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రతి వాహనానికి ప్రభుత్వం నిర్దేశించిన రిఫ్లెక్టర్లు (రేడియం స్టిక్కర్లు) తప్పనిసరిగా అమర్చాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి బరగడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ముందు–వెనుక, రెండు వైపులా రిఫ్లెక్టర్లు తప్పనిసరి

ప్రతి వాహనం ముందు భాగంలో తెలుపు (వైట్), వెనుక భాగంలో ఎరుపు (రెడ్), రెండు వైపులా నారింజ లేదా పసుపు (ఆరెంజ్/యెల్లో) రంగు రిఫ్లెక్టర్లు తప్పనిసరిగా అమర్చాలని సూచించారు. ముఖ్యంగా ట్రాక్టర్లకు అనుసంధానించే ట్రైలర్ల వెనుక భాగంలో ఎరుపు రంగు రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని తెలిపారు.

క్యూఆర్ ఆధారిత స్టిక్కర్లకే అనుమతి

తెలంగాణ ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 20 నుంచి క్యూఆర్ ఆధారిత మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) ద్వారా ధృవీకరించిన రిఫ్లెక్టర్లను మాత్రమే వినియోగించాలని ఆదేశించిందన్నారు. రాత్రి వేళలు, వర్షాకాలం, పొగమంచు వంటి పరిస్థితుల్లో ఈ రిఫ్లెక్టర్లు వాహనాలను దూరం నుంచే స్పష్టంగా గుర్తించేలా చేసి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు, జరిమానాలు

మోటారు వాహనాల నియమాలు–1989లోని రూల్–104 ప్రకారం రిఫ్లెక్టర్లు లేని వాహనాలు ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వాహన యజమాని, డ్రైవర్‌పై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు రవాణా శాఖ అధికారులు జరిమానాలు విధిస్తారని తెలిపారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల వరకు సస్పెండ్ చేయడంతో పాటు నిబంధనల ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్ష, రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

మైనర్ వాహనం నడిపితే.. 25 ఏళ్లు వచ్చే వరకు నో లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు

  • జిల్లా రవాణా శాఖ అధికారి బరగడి శ్రీనివాస్

మైనర్ వాహనం నడిపితే వారికి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబోమని జయశంకర్ జిల్లా రవాణా శాఖ అధికారి బరగడి శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మైనర్లు ప్రమేయం పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, మైనర్ నడిపిన వాహనం రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసే అధికారం అధికారులకు ఉందని పేర్కొన్నారు.

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వాహనాల తాళాలు పిల్లలకు అందుబాటులో ఉంచొద్దని సూచించారు. అలాగే, మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపైనా మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ అధికారి హెచ్చరించారు. అదేవిధంగా అన్ని వాహన యజమానులు తమ వాహనాలకు ప్రభుత్వం ఆమోదించిన క్యూఆర్ ఆధారిత ఎంఐఎస్ ధృవీకరించిన రిఫ్లెక్టర్లను తప్పనిసరిగా అమర్చడంతో పాటు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు.