MLA M.S. Raju | రాప్తాడు రాజకీయాల్లో ఉద్రిక్తత

MLA M.S. Raju | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు మధ్య రాజకీయ వివాదం తీవ్రరూపం దాల్చింది. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుపై తోపుదుర్తి అవినీతి ఆరోపణలు చేయగా, వాటిని ఖండించిన రాజు ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు.

ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్రలు, బీరు సీసాలు, కంకర రాళ్ల గుట్టలు లభించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు.

అదే సమయంలో తోపుదుర్తి అనుచరులతో నిర్వహించాలనుకున్న సమావేశాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలతో రాప్తాడు, మడకశిర నియోజకవర్గాల్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.