విద్యార్థుల హక్కుల కోసం ఏబీవీపీ నిరంతర పోరాటం
- రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలి రాజు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: జాతీయ విద్యార్థి దినోత్సవం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లిలో జెండా ఆవిష్కరణ నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలి రాజు మాట్లాడుతూ.. 1949 జూలై 9న స్థాపించబడిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా విద్యార్థుల హక్కుల పరిరక్షణ, జాతీయ చైతన్యం, విద్యా సంస్కరణలు, సమాజ సేవలో నిరంతరం కృషి చేస్తోందన్నారు.
1975లో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏబీవీపీ కార్యకర్తలు ధైర్యంగా పోరాడారని, వేలాది మంది విద్యార్థులు అరెస్టులు, నిర్బంధాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు వెనుకడుగు వేయలేదని పేర్కొన్నారు. దేశ సమగ్రతకు సంబంధించిన కీలక అంశాల్లో కూడా ఎబీవీపీ తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ అజయ్, జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, నాయకులు అరవింద్, దినేష్, గణేష్, అజయ్, జశ్వంత్, కార్తీక్, రిషిక్, ఆదిత్య, రమ్యశ్రీ, పల్లవి, ప్రవళికతో పాటు పూర్వ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
