నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం

  • పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందడుగు
  • రాజన్న ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధి మా బాధ్యత
  • రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • రోడ్డు వెడల్పు పనులు పరిశీలించిన విప్

వేములవాడ, ఆంధ్రప్రభ ; వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం వేములవాడ పట్టణంలో రాజన్న ఆలయం ముందు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రులు, దేవదాయ శాఖ జిల్లా మంత్రుల సహకారంతో పనులను వేగవంతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

రాజన్న ఆలయంలో సుమారు రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఆలయం ముందు నుంచి బ్రిడ్జి వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. నిర్వాసితులు, దుకాణదారులు, పట్టణ పెద్దలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ పనులు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. ఈ రోడ్డుకు సంబంధించి సుమారు రూ.6.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయనీ, కాంట్రాక్టర్ త్వరితగతిన పనులు పూర్తి చేసి అప్పగిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరితగతిన తారు రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

వేములవాడ పట్టణంలో బ్యూటిఫికేషన్ పనుల కోసం రూ.2.60 కోట్లతో చర్యలు తీసుకున్నామని, సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వనమహోత్సవం సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే అన్నదాన సత్రం పనులు రూ.35 కోట్లతో కొనసాగుతున్నాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బీమేశ్వర ఆలయాన్ని రూ.6 కోట్లతో ఆధునికరించినట్లు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి పూర్తయ్యే వరకు భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు.

బద్ది పోచమ్మ ఆలయం వద్ద కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని, అక్కడి నిర్వాసితులకు సెటర్లు ఏర్పాటు చేసే పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. వేములవాడను ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ సౌందర్యీకరణ, మౌలిక వసతుల పరంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కొండా శేఖర్, అన్నారపు శ్రీనివాస్, కొక్కుల బాలకృష్ణ , తోటరాజు, నాయకులు కూరగాయల కొమురయ్య, సాగరం వెంకటస్వామీ, తదితరులు పాల్గొన్నారు..