ఉట్నూర్‌లో ఘనంగా ఏబీవీపీ 78వ వ్యవస్థాపక దినోత్సవం
ఉట్నూర్, ఆంధ్రప్రభ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 78వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యవంశి యోగేశ్వర్, మండల కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఏబీవీపీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా సూర్యవంశి యోగేశ్వర్ మాట్లాడుతూ, “విద్యార్థి శక్తి – జాతి శక్తి” అనే సంకల్పంతో ఏబీవీపీ దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందిస్తూ పనిచేస్తోందని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
