గంజాయి స్మగ్లింగ్‌కు ముంబై హైవే అడ్డా..
గంజాయి స్మగ్లింగ్‌కు ముంబై హైవే అడ్డా..
హైదరాబాద్–ముంబై జాతీయ రహదారిపై పెరుగుతున్న అక్రమ రవాణా
కొత్త పద్ధతులతో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు
చిన్నచేపలు కాదు.. ప్రధాన ముఠాలపై చర్యలే కీలకం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్–ముంబై జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ఈ జాతీయ రహదారి పటాన్చెరు ఓఆర్ఆర్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మీదుగా సాగుతుంది. ఏపీలోని విశాఖపట్నం, అరకులోయ ప్రాంతాల నుంచి వచ్చే గంజాయిని విజయవాడ మీదుగా హైదరాబాద్ చేరవేసి, అక్కడి నుంచి ముంబై హైవే ద్వారా మహారాష్ట్రలోని పుణె, ముంబై, గుజరాత్ ప్రాంతాలకు తరలించడం స్మగ్లర్లకు సులభ మార్గంగా మారింది.
ముంబై హైవేపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి వివిధ వస్తువులతో లారీలు, డీసీఎంలు నిరంతరం ప్రయాణిస్తుంటాయి. దీంతో ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ఇదే పరిస్థితిని స్మగ్లర్లు అదునుగా తీసుకుని గంజాయి, డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
హైవేకు ఓఆర్ఆర్ అనుసంధానంగా ఉండటంతో హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించకుండానే పటాన్చెరు వద్ద నుంచి నేరుగా ముంబై హైవే వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల ఓఆర్ఆర్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీల్లో గంజాయి పట్టివేతలు పెరుగుతున్నాయి. ఏపీ–ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, గుజరాత్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా చేరవేయడానికి స్మగ్లర్లు ఈ మార్గాన్నే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సమాచారం.
కొత్త మార్గాలు.. కొత్త పద్ధతులు
పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయడంతో స్మగ్లర్లు కొత్త పద్ధతుల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కార్లు, లారీల బాడీల్లో ప్రత్యేక రహస్య క్యాబిన్లు ఏర్పాటు చేసి వాటిలో గంజాయిని దాచి తరలిస్తున్నారు.
నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్ల లోడుతో వెళ్లే వాహనాలను పోలీసులు ఎక్కువగా అనుమానించరనే భావనతో వాటి కింద గంజాయి మూటలను దాచిపెట్టి తీసుకెళ్తున్నారు. మరికొందరు లగ్జరీ కార్లను అద్దెకు తీసుకుని కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ప్రయాణిస్తున్నట్లుగా నటిస్తూ చెక్‌పోస్టులు దాటుతున్నారు. ఇటీవల స్థానిక ముఠాలతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తులను ఉపయోగిస్తూ స్లీపర్ సెల్ తరహా విధానంలో రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ పట్టివేతలు
సీసీఎస్, న్యాబ్, సదాశివపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ ఏడాది మార్చి 23న రూ.2.87 కోట్ల విలువైన 574 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మే 11న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్-3 వద్ద కూకట్పల్లి ఎస్వోటీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఒడిశా నుంచి షోలాపూర్‌కు తరలిస్తున్న 400 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు.
జూలై 2న అమీన్పూర్ పోలీసులు, ఎస్వోటీ సంయుక్తంగా సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్-4 వద్ద నిర్వహించిన తనిఖీల్లో 17 ప్యాకెట్లలో 34.50 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
అసలు సూత్రధారులపై దృష్టి ఎప్పుడు?
పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. వివిధ మార్గాల్లో గంజాయి తరలింపు కొనసాగుతూనే ఉంది. అయితే హైవేపై గంజాయి, డ్రగ్స్ రవాణా చేస్తున్న ప్రధాన సూత్రధారులు, కీలక ముఠాలు పోలీసులకు ఇంకా చిక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాల సభ్యులే ఉన్నట్లు సమాచారం. వీరి వెనుక ఉండి మొత్తం అక్రమ రవాణాను నడిపిస్తున్న ప్రధాన ముఠాలపై ఉక్కుపాదం మోపితేనే గంజాయి స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
