తాడిచర్ల-2 గని కేటాయింపుపై మోదీకి పాలాభిషేకం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: తాడిచర్ల బ్లాక్-2 బొగ్గు గనిని ఎలాంటి వేలం ప్రక్రియ లేకుండా సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సందర్భంగా బుధవారం కాసిపేట-2 బొగ్గు గని ఆవరణలో బీఎంఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు గుర్రం ప్రదీప్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో తాడిచర్ల బ్లాక్-2 గనిని సింగరేణికి ఎలాంటి వేలం లేకుండా కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.
తాడిచర్ల బ్లాక్-2 గని ద్వారా సింగరేణి సంస్థకు ఏటా 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు సుమారు రూ.64 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని తెలిపారు. అలాగే ఈ గని ద్వారా సుమారు 1,200 మంది కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంగం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కె. శ్రీనివాసరాజు, ఏరియా కార్యదర్శి చెట్టి వీరన్న, కేకే ఓపెన్‌కాస్ట్ ఫిట్ సెక్రటరీ రజనీకాంత్, బీజేపీ జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, కాసిపేట మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి ప్రసన్న, ఏ. శ్రీనివాస్, తోటపల్లి ఓం సాయి తదితరులు పాల్గొన్నారు.
