ఆ వంతెన పూర్తయ్యేదెప్పుడు..?
- 19 ఏళ్లుగా పూర్తికాని గుండి వంతెన..
- 2007లో ప్రారంభమైన నిర్మాణం ఇంకా అసంపూర్తి..
- 15 గ్రామాల ప్రజల ఆవేదన
ఆంధ్రప్రభ, ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని గుండి గ్రామం వద్ద గుండి వాగుపై నిర్మిస్తున్న హై లెవల్ వంతెన దాదాపు రెండు దశాబ్దాలుగా పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2007లో నాబార్డ్ నిధులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2010 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా, 2026 వచ్చినా ఇంకా నిర్మాణం అసంపూర్తిగానే ఉండడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయకపోతే రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామని గుండి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.
మొదట ఈ వంతెన నిర్మాణానికి రూ.8.50 కోట్ల వ్యయం అంచనా వేయగా, పనులు ఆలస్యం కావడంతో ప్రస్తుతం వ్యయం రూ.14.40 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం 11 పిల్లర్ల నిర్మాణమే పూర్తయిందని, వాటిపై కాంక్రీట్ స్లాబ్‌లు కూడా వేయలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని ఆరోపిస్తున్నారు. గుండి వాగుపై శాశ్వత వంతెన లేకపోవడంతో గుండి గ్రామంతో పాటు దాదాపు 15 గ్రామాల ప్రజలు ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆసిఫాబాద్ పట్టణంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి.
వంతెన లేకపోవడంతో స్థానికులు నాటు పడవలు, థర్మాకోల్ తెప్పలపై వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర వైద్య సేవలు, విద్యార్థుల రాకపోకలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా అన్నీ తీవ్రంగా దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో తాత్కాలికంగా మట్టి రహదారి వేసుకున్నా, వర్షాలు మొదలైతే అది కొట్టుకుపోవడం ప్రతి ఏడాది పరిపాటిగా మారిందని వాపోతున్నారు. ప్రతి వర్షాకాలంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఇన్నేళ్లుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి గుండి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, లేనిపక్షంలో రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేస్తున్నారు.
దాదాపు 20 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు వంతెన నిర్మాణంపై హామీలు ఇస్తున్నా అవి అమలు కాలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లు పలుమార్లు పనులు వేగవంతం చేస్తామని చెప్పినా, అవన్నీ మాటలకే పరిమితమయ్యాయని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని, లేకపోతే “వంతెన లేకపోతే ఓటు లేదు.. ఎన్నికలు లేవు” అంటూ రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.
కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం
15 గ్రామాల ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే అన్ని గ్రామాల ప్రజలను ఏకం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. వంతెన నిర్మాణం పూర్తి చేయడంలో నిర్లక్ష్యం కొనసాగితే సంబంధిత ప్రజాప్రతినిధులకు రాజకీయంగా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
