ఆత్మవిశ్వాసం, స్వయం సాధికారత ముఖ్యం
- బేటీ బచావో–బేటీ పడావో అవగాహనలో జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ బచావో–బేటీ పడావో (బీబీబీపీ) కార్యక్రమంలో భాగంగా ఝరాసంగం మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి కె.లలిత కుమారి మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం–2006, పోష్, పోక్సో చట్టం, మహిళలు–చిన్నారుల రక్షణకు సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్లు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆడపిల్లల ప్రాముఖ్యత, విద్య అవసరం, మహిళల భద్రత, సాధికారత వంటి అంశాలపై విద్యార్థినులకు సమగ్ర అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికల రక్షణతో పాటు వారి విద్య, ఆత్మవిశ్వాసం, స్వయం సాధికారత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా బాల్య వివాహాలు, వేధింపులు, వివక్ష వంటి సమస్యలను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సుశీల, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త, మెడికల్ ఆఫీసర్, సఖి సెంటర్ ప్రతినిధులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, పోలీసు శాఖ సిబ్బంది, జెండర్ స్పెషలిస్ట్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
