మద్యం మత్తులో కన్నతల్లి హత్య.. కుమారుడికి జీవిత ఖైదు

  • రూ.5 వేల జరిమానా విధించిన జిల్లా న్యాయస్థానం
  • మెదక్ జిల్లా ఎస్పీ డివి. శ్రీనివాసరావు

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: కన్నతల్లిని హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

టేక్మాల్ మండలం ఎల్పుగొండ గ్రామానికి చెందిన సుదర్శన్ మద్యానికి బానిసై తరచూ తన భార్యను వేధించేవాడని ఎస్పీ తెలిపారు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం సుదర్శన్ తన తల్లి సత్యమ్మ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని మద్యం మత్తులో తరచూ గొడవపడుతూ, దుర్భాషలాడుతూ, దాడులకు పాల్పడేవాడన్నారు. తన భార్యను తిరిగి తీసుకురావాలని తల్లితో తరచూ వివాదానికి దిగేవాడని పేర్కొన్నారు.

ఈ క్రమంలో 2025 నవంబర్ 8 అర్ధరాత్రి మద్యం మత్తులో మరోసారి తల్లితో గొడవపడి, కర్రతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సత్యమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ కృష్ణ కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు అధికారి అల్లాదుర్గ్ సీఐ రేణుక శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాధారాలు సేకరించి దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు.

కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడు సుదర్శన్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్పీ తెలిపారు.ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ సమర్థవంతంగా వాదనలు వినిపించగా, కోర్టు లైజన్ అధికారి ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ కృష్ణ సమన్వయంతో పనిచేశారు.

తక్కువ సమయంలో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు లైజన్ అధికారులు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.