శ్రీ ఉద్భవ లక్ష్మీదేవి ఆలయంలో చోరీ..

\హుండీ పగలగొట్టి నగదు అపహరణ
సీసీ కెమెరాలు, డీవీఆర్ బాక్స్, మానిటరింగ్ పరికరాలు ఎత్తుకెళ్లిన దుండగులు..

ఆలయంలోనే గిల్ట్ నగలు వదిలి పరారీ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో దిగువ ప్రాంతంలో ఉన్న శ్రీ ఉద్భవ లక్ష్మీదేవి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టి అందులోని నగదును అపహరించారు.

మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆలయ ప్రధాన ద్వారానికి వేసిన తాళాలను పగలగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. చోరీకి సంబంధించిన ఆధారాలు లభించకుండా ముందస్తుగా ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు, డీవీఆర్ బాక్స్, మానిటరింగ్ పరికరాలను తొలగించి ఎత్తుకెళ్లారు.

అనంతరం గర్భగుడికి వేసిన తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అమ్మవారికి ఉన్న ఆభరణాలను పరిశీలించిన దుండగులు అవి గిల్ట్ నగలు అని గుర్తించి వాటిని అక్కడే వదిలివేసి పరారయ్యారు.

ఆలయ అర్చకులు మయూరం బాలాజీచార్యులు ప్రతిరోజు మాదిరిగానే బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆలయానికి వచ్చారు. అమ్మవారికి అభిషేకం, అలంకరణ నిర్వహించేందుకు తలుపులు తెరిచే సమయంలో ప్రధాన ద్వారానికి వేసిన తాళాలు పగలగొట్టినట్లు గుర్తించారు.

లోపలికి వెళ్లి పరిశీలించగా హుండీ తాళం ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించినట్లు గుర్తించారు. వెంటనే దేవదాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆలయ ఈవో సాకే రమేష్‌బాబు ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించింది.