26 వేల వేతనం అమలు చేయాలి
వంద పడకల ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ధర్నా
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనంగా రూ.26 వేలును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గంటపాటు నిరసన ధర్నా నిర్వహించారు.
యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడాది సేవ పూర్తి చేసిన కార్మికులకు ఒక నెల వేతనంతో బోనస్, పండుగ సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, యూనిఫాంలు, సీనియర్ శానిటేషన్ కార్మికులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీఓ జారీ చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జూలై 9న హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయం ముట్టడిస్తా మని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్మికులు సంపత్, రాకేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
