పేద ప్రజల గుండె చప్పుడు ఆర్టీసీ

  • నాగర్‌కర్నూల్ నూతన టీజీఎస్‌ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన
  • రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) పేద ప్రజల గుండెచప్పుడు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోందని, ప్రగతి రథచక్రాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఆర్టీసీ సంస్థను తెలంగాణ ప్రభుత్వం పరిరక్షిస్తోందని పేర్కొన్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో వద్ద నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.12 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన బస్టాండ్‌కు బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, యువజన సేవల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం, సంక్షేమం, అభివృద్ధి అనే మూడు లక్ష్యాలతో ప్రభుత్వం ఆర్టీసీ పరిరక్షణకు కృషి చేస్తోందన్నారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంతో పాటు, వారి కృషితో సంస్థను లాభాల బాటలోకి తీసుకువచ్చామని తెలిపారు. పీఆర్సీ, ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు చేపట్టినట్లు వివరించారు.

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సౌకర్యాలు కల్పిస్తామని, ఎక్కడ ప్రయాణికులు ఉంటే అక్కడ బస్సులు నడిపించడమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిందని, సంస్థ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు, రైతు సంక్షేమం, వడ్డీలేని రుణాలు, మహిళల ఆర్థిక అభివృద్ధి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

ఓటర్ల సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటును నమోదు చేసుకోవాలని, ఓటు హక్కును కాపాడుకోవాలని మంత్రి కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో 10,170 బస్సులు, 97 డిపోలు, 364 బస్టాండ్లు, సుమారు 55 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారని చెప్పారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 326 కోట్ల మందికి పైగా మహిళలు ప్రయాణించారని వివరించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, ప్రస్తుతం ప్రభుత్వం సంస్థను బలోపేతం చేస్తూ లాభాల దిశగా నడిపిస్తోందన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.

ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, రూ.12 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించనున్న నూతన బస్టాండ్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌లో నూతన బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జిల్లాకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.

అంతకుముందు రూ.45 లక్షలతో నిర్మించిన రోడ్డు రవాణా కార్యాలయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, ఆర్టీసీ అధికారులు, ఆర్టీఏ సభ్యుడు గోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ సునీంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు