కరెంటు తీగ తెగిపడి రెండు మేకలు మృతి..

రూ.40 వేల నష్టం

మంథని రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో విద్యుత్ తీగ తెగిపడి రెండు మేకలు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో బాధిత రైతుకు సుమారు రూ.40 వేల మేర నష్టం వాటిల్లింది.

గ్రామానికి చెందిన జిల్లా శ్రీనివాస్ తన మేకలను మేత కోసం తీసుకెళ్లగా, అదే గ్రామానికి చెందిన దేవుని శ్రీనివాస్ వ్యవసాయ పొలం వద్ద అకస్మాత్తుగా విద్యుత్ తీగ తెగి మేకలపై పడింది. దీంతో రెండు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.

మృతి చెందిన మేకల విలువ సుమారు రూ.40 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న పశువైద్య శాఖ అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

ప్రభుత్వం స్పందించి బాధిత రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు. ఒకేసారి రెండు మేకలను కోల్పోవడంతో బాధితుడు జిల్లా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.