మార్పు చెందే దానిని శాశ్వతం అనుకుని పట్టుకుంటే దుఃఖం వస్తుంది.
శాశ్వతం కానిదాన్ని శాశ్వతం అనుకోవడమే మాయ
మనసు అంటుంది
భౌతిక ప్రపంచం లో ఉన్నవన్ని కావాలి అంటుంది
అవన్నీ ఉంటేనే నేను మనశాంతిగా ఉంటాను అని
బుద్ధి జ్ఞానం అంటుంది
అవన్నీ వదిలేస్తేనే నీకు మనశాంతి ఉంటుంది అని
“పట్టుకోవడం” అంటే కేవలం చేతితో పట్టుకోవడం కాదు. మనసుతో, ఆశతో, మమకారంతో, ఆధారపడుతూ ఉండడం. మన సంతోషం, శాంతి, భద్రత ఏదో ఒక వస్తువు, వ్యక్తి, పదవి, సంపద, పేరు ప్రతిష్ఠల మీద ఆధారపడితే, అవి మారినప్పుడు మనసు బాధపడుతుంది.
ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి పరిస్థితి, ప్రతి సంబంధం మార్పుకు లోబడి ఉంటుంది.
మార్పు చెందే దానిని శాశ్వతం అనుకుని పట్టుకుంటే దుఃఖం వస్తుంది.
అందుకే మహర్షులు “మాయ” అని చెప్పారు.
మాయ అంటే లేనిది కాదు;
శాశ్వతం కానిదాన్ని శాశ్వతం అనుకోవడమే ( మాయ )
- డబ్బును పట్టుకుంటే
డబ్బే జీవితమని భావించిన వ్యక్తి డబ్బు పెరిగితే సంతోషపడతాడు, తగ్గితే బాధపడతాడు.
డబ్బు పోతుందేమో అనే భయం, ఇంకా సంపాదించాలనే ఆశ, ఇతరులతో పోలికలు
డబ్బు ఏదో ఒకనాడు దూరం కావాల్సిందే ఈ సత్యం గ్రహించకపోతే మనశ్శాంతిని దూరం చేస్తాయి. - పదవిని పట్టుకుంటే
ఒక అధికారి తన పదవినే తన గుర్తింపుగా భావిస్తాడు.
పదవి ఉన్నంత వరకు గౌరవం ఉంటుంది.
పదవీ విరమణ తర్వాత అదే గౌరవం తగ్గితే బాధ మొదలవుతుంది.
పదవి శాశ్వతం కాదు అనే ఈ సత్యాన్ని గ్రహించాలి - అందాన్ని పట్టుకుంటే
యవ్వనం, అందం ఎప్పటికీ ఉండవు.
అందంపై ఎక్కువ మమకారం పెంచుకుంటే వయస్సు పెరిగేకొద్దీ బాధ పెరుగుతుంది.
అద్దంలో కనిపించే మార్పులు మనసును కలచివేస్తాయి.
అందం శాశ్వతం కాదు అనే సత్యాన్ని గ్రహించాలి - శరీరాన్ని పట్టుకుంటే
శరీరం పుట్టినప్పటి నుంచి మారుతూనే ఉంటుంది.
వ్యాధులు వస్తాయి, వృద్ధాప్యం వస్తుంది.
శరీరమే నేను అనుకుంటే ప్రతి చిన్న అనారోగ్యం కూడా పెద్ద బాధగా అనిపిస్తుంది.
శరీరం శాశ్వతం కాదు అనే సత్యాన్ని గ్రహించాలి - ప్రేమించిన వ్యక్తిని పట్టుకుంటే
ప్రేమ అవసరం. కానీ “నువ్వు లేక నేను బతకలేను” అనే స్థాయి ఆధారపడటం బాధకు కారణం.
వ్యక్తులు మారవచ్చు, దూరం కావచ్చు, మరణించవచ్చు.
అప్పుడు తీవ్రమైన దుఃఖం వస్తుంది
ప్రేమించిన వస్తువు ఏదైనా ఏదో ఒకనాడు దూరం కావాల్సిందే అనే సత్యాన్ని గ్రహించాలి - పిల్లలను పట్టుకుంటే
పిల్లలు మన జీవితంలో భాగం మాత్రమే.
వాళ్లు తమ జీవితాన్ని జీవించాలి.
వాళ్లు మన మాట వినకపోతే, విదేశాలకు వెళ్లిపోతే, వారి నిర్ణయాలు భిన్నంగా ఉంటే
తల్లిదండ్రులు బాధపడతారు.
పక్షులకు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతాయి అలాగే పిల్లలు పెద్దవారైన తర్వాత వారి బాగోగులు వారు చూసుకుంటారు అనే సత్యాన్ని గ్రహించాలి - పేరుప్రతిష్ఠలను పట్టుకుంటే
ప్రజలు నన్ను గొప్పవాడని అనుకోవాలని కోరుకుంటాం.
ఒక చిన్న విమర్శ వచ్చినా మనసు బాధపడుతుంది.
ఎందుకంటే మన సంతోషాన్ని ఇతరుల అభిప్రాయాల చేతుల్లో పెట్టాము.
ఇతరుల అభిప్రాయాలు ఆస్తమానం మారుతూ ఉంటాయి. అభిప్రాయాలు మారినప్పుడల్లా విలువలు గౌరవాలు మారుతూ ఉంటాయి అనే సత్యాన్ని గ్రహించాలి - ఆస్తిని పట్టుకుంటే
ఇల్లు, భూమి, బంగారం మీద అధిక మమకారం పెంచుకుంటే వాటి రక్షణ గురించే ఆలోచనలు పెరుగుతాయి.
ఆస్తి పెరిగిన కొద్దీ ఆందోళనలు కూడా పెరుగుతాయి.
ఆస్తి మూడుతారాలకు మాత్రమే ఉంటుంది తర్వాత ఏదో రకంగా చేజారిపోతుంది అనే సత్యాన్ని గ్రహించాలి - అభిప్రాయాలను పట్టుకుంటే
“నేను చెప్పిందే నిజం” అని గట్టిగా పట్టుకుంటే గొడవలు వస్తాయి.
భార్యాభర్తల్లో, స్నేహితుల్లో, సమాజంలో
అభిప్రాయ భేదాలు సహజం.
అవి అంగీకరించలేకపోతే బాధ తప్పదు.
అభిప్రాయాలు నిజాలు కావు
నిజం మాత్రమే నిజం అనే సత్యాన్ని గ్రహించాలి - జీవితాన్నే తన ఇష్టానికి జరగాలని పట్టుకుంటే
మనిషి అన్నీ తన ప్రణాళిక ప్రకారం జరగాలని కోరుకుంటాడు.
కానీ జీవితం ఎప్పుడూ మన ఇష్టానుసారం నడవదు.
అనుకున్నది జరగకపోతే నిరాశ, కోపం, బాధ వస్తాయి.
ఎవరి జీవితం వారి ఆలోచన మీద నడవదు
ఎవరి జీవితం వారి నమ్మకాల మీద నడవదూ
ఎవరి జీవితమైనా కాలం కర్మ ప్రకృతి ఆధీనంలో నడుస్తుంది అనే ఈ సత్యాన్ని గ్రహించాలి
అసలు సమస్య వస్తువుల్లో కాదు, పట్టుకోవడంలో ఉంది
పువ్వును చూడడం తప్పు కాదు, కానీ
అది వాడిపోకూడదని అనుకోవడం బాధ.
డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ
డబ్బులోనే ఆనందం వెతకడం బాధ.
ప్రేమించడం తప్పు కాదు, కానీ
ఆ వ్యక్తిని పూర్తిగా స్వంతం చేసుకోవాలని ప్రయత్నించడం బాధ.
సంబంధాలు ఉండాలి, బాధ్యతలు ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ వాటిని శాశ్వతం అని భావించి పట్టుకోవద్దు.
ఈ జగత్తులోని ప్రతి వస్తువు మార్పుకు లోబడి ఉంటుంది. మారే దానిని శాశ్వతం అనుకుని పట్టుకుంటే
ఇక్కడే ప్రతి ఒక్కరికి దుఃఖం వస్తుంది.
ఉపయోగించాల్సిన వాటిని ఉపయోగించాలి, ప్రేమించాల్సిన వారిని ప్రేమించాలి,
బాధ్యతలను నిర్వర్తించాలి. కానీ వాటిపైనే మన ఉనికిని ఆధారపరచకూడదు.
పట్టుకోవడం బంధనం.
అర్థం చేసుకోవడం జ్ఞానం.
అంగీకరించడం శాంతి.
వదిలిపెట్టడం విముక్తి.
ఏది పట్టుకోకపోవడం శాంతి.
