వాల్మీకి విగ్రహ గోపురంపైకి యువకుడు..
ఉత్కంఠ రేపిన ఘటన
మానవీయంగా స్పందించిన పోలీసులు..
క్షేమంగా దించేందుకు కొనసాగిన రక్షణ చర్యలు
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కొత్తచెరువు మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుక్కపట్నం రోడ్డులో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహం గోపురం పైభాగానికి బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన సాయి అలియాస్ తిక్క సాయి (బోయ) ఎక్కి కూర్చోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కొత్తచెరువు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని యువకుడిని సురక్షితంగా కిందికి దింపేందుకు చర్యలు ప్రారంభించారు.
ఎత్తైన గోపురంపై యువకుడు ఉండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని కొంతసేపు ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. అతడిని బలవంతంగా కిందికి దించే ప్రయత్నం చేయకుండా ప్రశాంతంగా మాట్లాడిస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉండటంతో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేస్తూ రక్షణ చర్యలు కొనసాగించారు.
స్థానికుల కథనం ప్రకారం సాయికి కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి అసాధారణ ప్రవర్తనతో రాళ్లు, చెట్లు వంటి ఎత్తైన ప్రదేశాలపైకి ఎక్కి దూకడంతో పలుమార్లు గాయపడిన ఘటనలు జరిగినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేశారు.
ఘటన స్థలంలో పోలీసులు మానవీయ దృక్పథంతో స్పందిస్తూ యువకుడి ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అతడిని సురక్షితంగా కిందికి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు కొనసాగించారు.
ఈ ఘటనను చూసిన స్థానికులు యువకుడు క్షేమంగా కిందికి దిగాలని ఆకాంక్షిస్తూ అక్కడే వేచి ఉన్నారు. ప్రజలు అనవసరంగా గుమిగూడకుండా పోలీసుల రక్షణ చర్యలకు సహకరించాలని అధికారులు సూచించారు.
