రేవంత్, ఉత్తమ్‌ను ఉరి వేసినా తప్పులేదు. : హరీష్

రేవంత్, ఉత్తమ్‌ను ఉరి వేసినా తప్పులేదు. : హరీష్

గోదావరి జలాల వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రేవంత్‌, ఉత్తమ్‌పై బీఆర్ఎస్ నేత ఆరోపణలు
దేవాదుల ఎత్తిపోతల పథకం మోటార్లను ఎందుకు నడపడం లేదని ప్రశ్న
తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు మళ్లిస్తున్నారని విమర్శ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో సాగునీటి నిర్వహణ, గోదావరి జలాల వినియోగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఫల్యం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

రాష్ట్రంలో నదుల్లో సమృద్ధిగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ ఎత్తిపోతల పథకాల మోటార్లను పూర్తిస్థాయిలో నడపడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంటూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలో విఫలమయ్యారని విమర్శించారు.

దేవాదుల ఎత్తిపోతల పథకం వద్ద మోటార్లను ఎందుకు ప్రారంభించడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఎలాంటి సాంకేతిక లేదా చట్టపరమైన అభ్యంతరాలు లేనప్పటికీ నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టకపోవడం వెనుక కారణం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు వినియోగించాల్సిన గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సాగునీటి రంగంలో అవసరమైన మౌలిక వసతులు, ప్రాజెక్టులు ఏర్పాటు చేశారని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాటిని సమర్థంగా వినియోగించడంలో విఫలమైందని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అవి వాస్తవాలకు విరుద్ధమని హరీశ్‌రావు ఆరోపించారు. ఆయన చేసిన ప్రతి వ్యాఖ్యకు తాను ఆధారాలతో సమాధానం ఇస్తానని తెలిపారు.