విద్యార్థుల క్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందిస్తున్నాం

మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించిన సర్పంచ్ కాటం వెంకటేశం

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మధ్యాహ్న భోజన పథకంలో ప్రోటీన్లు అధికంగా ఉండే అల్పాహారం, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టారని చిట్యాల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం అన్నారు.

మంగళవారం చిట్యాల మండలం పెద్దకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.

ఈ సందర్భంగా కాటం వెంకటేశం మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం మెనూ రేట్లను పెంచడమే కాకుండా, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందడంతో పాటు వారు చదువులోనూ రాణించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, ఉపాధ్యాయురాలు కందిమల్ల యశోద రెడ్డి, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు హరీష్ రెడ్డి, ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.