కొమ్మిడి నరసింహారెడ్డి మృతి తెలంగాణకు తీరని లోటు
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ ఉద్యమనేత కొమ్మిడి నరసింహారెడ్డి (83) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నరసింహారెడ్డి మరణం భువనగిరి ప్రాంతానికే కాక, ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలకే కాకుండా యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.
సర్పంచ్ నుండి శాసనసభ్యుని వరకు ప్రస్థానం
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లిలో 1943 సెప్టెంబర్ 10న జన్మించిన కొమ్మిడి నరసింహారెడ్డి చిన్నతనం నుంచే ప్రజాసేవ వైపు అడుగులు వేశారు. 1962 నుండి 1970 వరకు సుదీర్ఘకాలం పాటు బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా సేవలందించి ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1978, 1983 లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, రాజకీయాల్లో అత్యంత నిజాయతీ గల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
సొంత ఇల్లు కూడా లేని నిరాడంబర జీవి.. 300 ఎకరాల భూదానం
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… నరసింహారెడ్డి భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ, ఆస్తిపాస్తుల కంటే ప్రజా సంక్షేమమే పరమావధిగా బతికారని కొనియాడారు. వినోబాభావే నడిపిన భూదానోద్యమ స్ఫూర్తితో తనకున్న దాదాపు 300 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేసిన మహోన్నత వ్యక్తి ఆయనని స్మరించుకున్నారు. ప్రజాసేవలోనే సర్వస్వం ధారపోసి, చివరికి తనకంటూ ఒక సొంత ఇల్లు కూడా నిర్మించుకోకుండా అత్యంత నిరాడంబరంగా జీవితాన్ని గడిపిన నరసింహారెడ్డి త్యాగం అనన్య సామాన్యమైనదన్నారు.
ఉద్యమాల్లో అగ్రభాగం – ప్రజా చైతన్య వేదిక వ్యవస్థాపకులు
నరసింహారెడ్డి కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా గొప్ప ఉద్యమకారుడిగా చెరగని ముద్ర వేశారు. 1969 నాటి తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన, మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా గళమెత్తారు. ‘ప్రజా చైతన్య వేదిక’ను స్థాపించి ప్రజల్లో చైతన్యం నింపారు. ప్రాంతీయ సమస్యలపై నిరంతరం పోరాడుతూ.. ‘గోదావరి జలాల సాధన ఉద్యమ నేత’గా, ‘మూసీ పరిరక్షణ ఉద్యమకారుడు’గా ఆయన చేసిన పోరాటాలు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
తరతరాలకు స్ఫూర్తిప్రదాత – ప్రగాఢ సానుభూతి
నాటి తరం రాజకీయ విలువలను కాపాడుతూ, నేటి తరం యువ నాయకులకు కొమ్మిడి నరసింహారెడ్డి దిక్సూచిలా నిలిచారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ రాజగోపాల్ రెడ్డి తన గాఢ సానుభూతిని ప్రకటించారు.
