సింగరేణిపై ప్రేమ ఉంటే కొత్త బొగ్గు బ్లాకులు ఇప్పించండి!

కిషన్‌రెడ్డి రివ్యూతో సంస్థకు ప్రయోజనం లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి విమర్శ

గోదావరిఖని, ఆంధ్రప్రభ : గని కార్మికుల యూనిఫాం ధరించినంత మాత్రాన సింగరేణిపై ప్రేమ ఉన్నట్లు కాదని, నిజంగా సింగరేణి బొగ్గు పరిశ్రమపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ప్రేమ ఉంటే సంస్థకు కొత్త బొగ్గు బ్లాకులు ఇప్పించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.

మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి తెలంగాణలోని బొగ్గు పరిశ్రమకు మేలు చేసే విధంగా పనిచేయాలని కోరారు. బొగ్గు పరిశ్రమ మనుగడ కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, సింగరేణి పరిరక్షణ కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని అన్నారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి నిర్వహించిన రివ్యూతో సింగరేణి సంస్థకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. ఆ సమావేశం ఎవరి ప్రయోజనాల కోసం నిర్వహించారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కొత్త బొగ్గు బ్లాకుల అంశంపై నిర్వహించిన రివ్యూలో ఎలాంటి స్పష్టత ఇచ్చారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

కొయ్యగూడెం–సత్తుపల్లి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని, బొగ్గు నిల్వలపై విచారణకు సింగరేణి అధికారులతోనే కమిటీ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రాజిరెడ్డి అన్నారు.

టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసింది బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. కోల్ పరిశ్రమ పరిరక్షణకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సింగరేణి సంస్థను కాపాడుకుంటామని, కార్మికుల హక్కుల సాధనలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు పార్లపల్లి రవి, జావిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, సత్యం తదితరులు పాల్గొన్నారు.