గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

పెడన, ఆంధ్రప్రభ: పెడన–216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగాయలంక సమీపంలోని దీనదయాళపురం గ్రామానికి చెందిన సంతోష్‌రావు (47) మృతి చెందారు. ఆయన పెడనలో రైల్వే ట్రాక్‌పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనుల వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు.

సోమవారం రాత్రి విధులు ముగించుకుని మంగళవారం ఉదయం తోటమూలలోని తన నివాసానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పెడన సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనం సుమారు 100 అడుగుల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంతోష్‌రావు అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు చదువుకుంటుండగా, కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారి ఇంట విషాదం నెలకొంది.