ముందస్తు నిఘాతో సురక్షిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
ముందస్తు నిఘాతో సురక్షిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
ముందస్తు నిఘా, నివారణాత్మక పోలీసింగ్‌పై హోంమంత్రి దిశానిర్దేశం
డ్రగ్స్ నిర్మూలన, గంజాయి నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ విజయాలు
మహిళల భద్రతకు శక్తి కార్యక్రమం ఫలితాలు
సైబర్ నేరాలు, దుష్ప్రచారంపై కఠిన చర్యలు
అమరావతి, ఆంధ్రప్రభ: ముందస్తు నిఘా, నివారణాత్మక పోలీసింగ్ ద్వారానే శాంతిభద్రతలను సమర్థంగా కాపాడగలమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సున్నిత ప్రాంతాల్లో రాజకీయ పర్యటనల కోసం ప్రామాణిక కార్యాచరణ విధానాలు రూపొందించాలని, భూవివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మాదక ద్రవ్యాల నిర్మూలన, అమరావతి రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలు, కుల-ఫ్యాక్షన్ వివాదాలు, మహిళలు, చిన్నారుల భద్రత, వ్యవస్థీకృత దుష్ప్రచార సామాజిక మాధ్యమ కార్యకలాపాలపై చర్యలు, పోలీసు-ప్రాసిక్యూషన్ సమన్వయం తదితర అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించారు. డ్రగ్స్ రహిత, సురక్షిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు.
డీజీపీతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని పోలీసు రేంజ్లు, ప్రత్యేక విభాగాల పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఈగల్ టాస్క్ ఫోర్స్, విశాఖపట్నం రేంజ్ పనితీరును సమీక్షించిన హోంమంత్రి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి, డ్రోన్ నిఘా, ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు, గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంతో ఆ విజయాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని తెలిపారు.
మొత్తం 29,839 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయించామని, పిట్-ఎన్డీపీఎస్ చట్టం కింద 131 మందిని నిర్బంధించామని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులకు చెందిన రూ. 10.18 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేశామని వెల్లడించారు.
మాదకద్రవ్యాల నియంత్రణను మరింత బలోపేతం చేసేందుకు 22 వేలకుపైగా పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంపై స్వతంత్ర ప్రజాభిప్రాయ సర్వేలో 72 శాతం మంది సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారని, అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ఉత్తమ విధానాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా గుర్తించిందని మంత్రి పేర్కొన్నారు.
ఏలూరు రేంజ్ సమీక్షలో గ్రామస్థాయిలో ఘర్షణల మ్యాపింగ్, సున్నిత ప్రాంతాలకు భద్రత, విగ్రహాల రక్షణ, శాంతి కమిటీల సమర్థ నిర్వహణ వల్ల కుల ఘర్షణలు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. కర్నూలు రేంజ్‌లో ఫ్యాక్షన్ కార్యకలాపాలు పోలీసు పికెట్లు, నిరంతర నిఘా, గుర్తించిన వ్యక్తులకు కౌన్సెలింగ్ వంటి చర్యలతో అదుపులో ఉన్నాయని వివరించారు. అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2016 నుంచి మతపరమైన ఘర్షణలు జరగకపోవడం నివారణాత్మక పోలీసింగ్ విజయానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
మహిళల భద్రత మెరుగు..
రెండేళ్లలో శక్తి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మహిళల భద్రత గణనీయంగా మెరుగుపడిందని హోంమంత్రి తెలిపారు. శక్తి యాప్‌ను 1.55 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 164 శక్తి బృందాలు పనిచేస్తున్నాయని, దాదాపు 900 ప్రమాదకర ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలుగా మార్చామని వెల్లడించారు.
ఆపరేషన్ ట్రేస్ ద్వారా ఇప్పటివరకు 9,007 మంది గల్లంతైన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని తెలిపారు. లైంగిక నేరాల దర్యాప్తు పూర్తి చేసే శాతం 39.41 నుంచి 90.20 శాతానికి పెరిగిందని, మహిళలపై నేరాలు 6.9 శాతం తగ్గినట్లు వెల్లడించారు.
సైబర్ నేరాలు, వ్యవస్థీకృత దుష్ప్రచార సామాజిక మాధ్యమ కార్యకలాపాలపై సమీక్ష సందర్భంగా, 2024 జూన్ నుంచి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దుష్ప్రచారాలపై 1,665 కేసులు నమోదు చేశామని, అందులో 725 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు మంత్రి తెలిపారు. సహయోగ్ పోర్టల్ ద్వారా 12,653 అక్రమ వెబ్ లింకులు తొలగించినట్లు వెల్లడించారు.
ప్రతి జిల్లాలో సైబర్ గార్డ్ యూనిట్లు, జిల్లా సోషల్ మీడియా సెల్‌లు ఏర్పాటు చేయాలని, వ్యవస్థీకృత నేరగాళ్లపై నెట్‌వర్క్ ఆధారిత దర్యాప్తును బలోపేతం చేయాలని, పునరావృత నేరాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య చర్చలు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా అన్ని చర్యలు ఉండాలని స్పష్టం చేశారు.
సీనియర్ పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడిన హోంమంత్రి, డ్రగ్స్ రహిత, సురక్షిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. మాదకద్రవ్యాల ముఠాలు, వ్యవస్థీకృత నేరగాళ్లు, అలవాటుగా నేరాలకు పాల్పడే వ్యక్తులు, రెచ్చగొట్టే అక్రమ కంటెంట్ వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. అదే సమయంలో ప్రజాకేంద్రిత, సున్నితమైన, ప్రతి వర్గానికీ అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
