Telangana Debt Challenge | రాజీనామాకు సిద్ధం.. మంత్రి జూపల్లి

Telangana Debt Challenge | రాజీనామాకు సిద్ధం.. మంత్రి జూపల్లి

తెలంగాణ అప్పులపై రాజకీయ రగడ..
రూ.8.21 లక్షల కోట్ల అప్పులపై జూపల్లి సంచలన సవాల్
లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానన్న జూపల్లి
హరీశ్‌రావు, కేటీఆర్ కాదు.. కేసీఆర్ స్వయంగా చర్చకు రావాలని డిమాండ్
జూపల్లి సవాల్‌కు కేటీఆర్ కౌంటర్..
తెలంగాణ భవన్‌లో కుర్చీ వేసి ఎదురుచూశామన్న బీఆర్ఎస్

Telangana Debt Challenge | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. రాష్ట్ర అప్పుల లెక్కలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతుండగా.. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సంచలన సవాల్ విసిరారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న రుణాలు, పెండింగ్ బిల్లులు కలిపి రాష్ట్రంపై మొత్తం రూ.8,21,651 కోట్ల భారం పడిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఈ లెక్కలు తన వ్యక్తిగత అంచనాలు కాదని, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అందించిన అధికారిక వివరాల ఆధారంగానే చెబుతున్నానని స్పష్టం చేశారు. తాను వెల్లడించిన గణాంకాలు తప్పని నిరూపిస్తే తన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

బీఆర్ఎస్ నేతల తీరు ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్నట్లుగా ఉందని మంత్రి జూపల్లి ఎద్దేవా చేశారు. తాము చేసిన అప్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకసారి రూ.3,17,015 కోట్లు అని, మరోసారి రూ.3,85,340 కోట్లు మాత్రమే అని పరస్పర విరుద్ధంగా మాట్లాడారని గుర్తుచేశారు. అటు హరీష్ రావు అసెంబ్లీలో ఒకసారి రూ.4,26,099 కోట్ల అప్పు అని, ఇంకోసారి రూ.4,17,496 కోట్లు మాత్రమేనని చెప్పారని దుయ్యబట్టారు. అస్సలు కేటీఆర్, హరీష్ రావులు తాము అసెంబ్లీలో మాట్లాడిన లెక్కలకు కట్టుబడి ఉన్నారా? అని నిలదీశారు.

ఈ అంశంపై మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ స్పందించడం కాకుండా, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని మంత్రి జూపల్లి డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అంశంపై ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వంపై ఉందన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కూడా సవాల్ విసిరారు.

మంత్రి జూపల్లి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్గాలు వెంటనే స్పందించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో చర్చ కోసం కుర్చీ ఏర్పాటు చేసి ఎదురుచూశామని వ్యాఖ్యానించడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, రాష్ట్ర అప్పుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది.